ప్రియుడు దక్కలేదన్న కక్షతో హెచ్‌ఐవీ ఇంజెక్షన్.
– డాక్టర్ భార్యపై ప్రాణాంతక దాడి చేసిన నర్సు.
– కర్నూలులో సభ్య సమాజాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన.
జనం వాయిస్, వెబ్ డెస్క్:
సినిమా కథను తలపించే ఓ భయానక ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఇల్లెందులో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాలో చూపినట్లే, ప్రేమలో విఫలమైన ఓ మహిళ అసూయతో మరో మహిళ ప్రాణాలపైకి తెచ్చింది. అయితే సినిమాలో తండ్రి పాత్రలో జరిగిన ఘోరం ఇక్కడ ఓ నర్సు చేతుల మీదుగా జరగడం గమనార్హం.
కర్నూలు జిల్లా మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం ఓ మహిళా డాక్టర్ స్కూటీపై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్‌తో ఢీకొట్టారు. ఆమె కింద పడగానే అక్కడే ఉన్న ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి సాయం చేస్తున్నట్లు నటిస్తూ ఆటో ఎక్కిస్తామని చెప్పారు. అదే సమయంలో ఆ మహిళా డాక్టర్‌కు ఓ ఇంజెక్షన్ చేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
వెంటనే బాధిత వైద్యురాలు తన భర్తకు సమాచారం ఇచ్చి, తనపై విష ప్రయోగం జరిగిందని అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు, సెల్‌టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఘటన సమయంలో నలుగురు వ్యక్తులు అక్కడ ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల్లో బీచుపల్లి బోయ వసుంధర అలియాస్ వేదవతి (కర్నూలు) ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమె గతంలో ఓ డాక్టర్‌ను ప్రేమించింది. అయితే ఆ డాక్టర్ ఆమెను కాకుండా మరో మహిళా డాక్టర్‌ను వివాహం చేసుకున్నాడు. దీంతో ప్రియుడు దక్కలేదన్న కక్షతో వసుంధర ఆ డాక్టర్ భార్యపై తీవ్ర ద్వేషం పెంచుకుంది.
ఈ క్రమంలో ఆమె బాధిత వైద్యురాలికి హెచ్‌ఐవీ సోకేలా ఇంజెక్షన్ చేయాలని పథకం రచించింది. ఇందుకు కొంగె జ్యోతి (ఆదోని), భూమా జశ్వంత్, భూమా శృతి (మంత్రాలయం)ల సహకారం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెచ్‌ఐవీ బాధితుల నుంచి ఇతర నర్సుల సహాయంతో హెచ్‌ఐవీ వైరస్‌తో కూడిన రక్తాన్ని సేకరించి, దాన్ని ఇంజెక్షన్ రూపంలో బాధిత మహిళా డాక్టర్‌కు ఎక్కించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ఘటన సభ్య సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని, ఇలాంటి నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments