కల్వల ప్రాజెక్టు పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
-రైతుల పంట నష్టంపై తీవ్ర ఆవేదన
జనం వాయిస్,కరీంనగర్,అక్టోబర్ 31:
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టు పరిస్థితిని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమెకు జాగృతి కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో వెంట ఉన్నారు. ప్రాజెక్టు వైపు ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో ఏర్పడిన భారీ వర్షాల కారణంగా వరి పంటలు ముంచెత్తిన దృశ్యాలను చూసి కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో నేల వాలిపోయి పంట పూర్తిగా నష్టపోయిన రైతులను కలసి వారి బాధలను విన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని వారిని ధైర్యం చెప్పారు.కల్వల మత్తడి మరమ్మతులపై మాట్లాడుతూ “శంకరపట్నం మండలంలోని కల్వల మత్తడి కొట్టుకుపోయి మూడు సంవత్సరాలు అవుతోంది. దీన్ని పునర్నిర్మించడానికి గత ప్రభుత్వం ఇప్పటికే రూ.70 కోట్లు మంజూరు చేస్తూ జీవో కూడా జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానందువల్ల రైతులు ప్రతి సంవత్సరం నష్టాలను ఎదుర్కొంటున్నారు” అని అన్నారు. “ప్రాజెక్టు మత్తడి బాగు చేయకపోవడం వల్ల కరీంనగర్, జగిత్యాల పరిసర ప్రాంతాల పంటలు వర్షాల సమయంలో తీవ్ర నష్టానికి గురవుతున్నాయి. ప్రజల పన్నుల డబ్బుతో మంజూరైన నిధులు ఎక్కడ వినియోగమయ్యాయి? ఈ నిర్లక్ష్యం ఎవరిది?” అని ప్రశ్నించారు.కవిత రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. “వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు తక్షణ ఆర్థిక సాయం అందించాలి. మత్తడి మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి. రైతులు ఏడవకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత” అని అన్నారు.ఈ సందర్భంగా కవితతో కలిసి స్థానిక ప్రజలు తమ సమస్యలను తెలియజేసారు. కల్వల ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటేనే ప్రాంతీయ వ్యవసాయం కాపాడబడుతుందని ఆమె స్పష్టం చేశారు.ప్రాంతమంతా ఈ సందర్శనతో ఉత్సాహంగా మారగా, రైతులు తమ పట్ల కవిత చూపిన సానుభూతి, స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments