ప్రజల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం: కవిత.
-ఉప్పల్ ఫ్లైఓవర్ పనుల్లో ఎనిమిదేళ్ల ఆలస్యం.
-పనుల పురోగతిని పరిశీలించిన జాగృతి అధ్యక్షురాలు.
-కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం లేకపోవడమే ఆలస్యానికి కారణం.
-పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్.
జనం వాయిస్, హైదరాబాద్:
ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను స్వయంగా సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పనుల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లుగా నిర్మాణం సాగుతున్నా, ప్రజల సమస్యలు అలాగే ఉన్నాయంటే ప్రభుత్వం పట్ల ప్రజల విశ్వాసం తగ్గిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. శాసన మండలిలో ఈ అంశంపై ప్రస్తావించినప్పుడు, మంత్రి కోమటి రెడ్డి హామీ ఇచ్చినా, పరిస్థితిలో మార్పు లేదని పేర్కొన్నారు. కవిత మాట్లాడుతూ, “ఎనిమిదేళ్లుగా కడుతున్నారంటే ప్రజల పట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థమవుతోంది. ఈ ఫ్లైఓవర్ వల్ల ఘట్కేసర్ వరకు ప్రయాణించే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గాలని లక్ష్యం. కానీ కాంట్రాక్టర్ మారినా, పని మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది” అని అన్నారు. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కోసం జాగృతి జనం బాటలో భాగంగా ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడమే పనుల ఆలస్యానికి ప్రధాన కారణం అని కవిత ఆరోపించారు. “కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులు పూర్తిచేయించాలి. ఈ ప్రాంత ఎంపీ ఈటల రాజేందర్ ఇక్కడికి వచ్చి పరిస్థితి చూడాలి. ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కనుక బీజేపీ ఎంపీగా బాధ్యత తీసుకోవాలి” అని ఆమె అన్నారు. “స్థానిక ఎమ్మెల్యే కూడా నిరసన తెలుపుతూ, వెంటపడుతూ పనులు చేయించాలి. కేంద్రం, రాష్ట్రం కలిసి తక్షణమే నిర్మాణాన్ని పూర్తి చేయాలి. లేదంటే జాగృతి సంస్థే ప్రభుత్వం వెంట పడి పనులు చేయిస్తుంది” అని కవిత హితవు పలికారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments