రామన్న చెరువు సమస్యపై కవిత ఆవేదన.
– కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ డిమాండ్.
– చెరువు పొంగిపొర్లి కాలనీలు మునుగుతున్నాయని ఆందోళన.
– సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కవిత హామీ.
– విలీనమే శాశ్వత పరిష్కార దారి అని జాగృతి అభిప్రాయం.
జనం వాయిస్, హైదరాబాద్:
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయిన్‌పల్లిలో రామన్న చెరువు నీరు పొంగి పరిసర కాలనీలు మునిగిపోతున్న పరిస్థితిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యక్షంగా పరిశీలించారు. చెరువు నిర్వహణలో నిర్లక్ష్యం, సమస్య పరిష్కారంలో బాధ్యతా రాహిత్యం స్థానిక ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.చెరువు పూర్తిగా నిండిపోవడంతో సమీప కాలనీలు నీట మునిగిపోయాయని, ప్రజలు నిత్యజీవనంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కవిత తెలిపారు. “ఈ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల భద్రతకు సంబంధించి ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా చర్యలు అవసరం” అని ఆమె అన్నారు.కంటోన్మెంట్ ప్రాంతం ప్రత్యేక పరిపాలనలో ఉండటం వల్ల సమస్యలను ఎవరూ పట్టించుకోవడంలేదని కవిత మండిపడ్డారు. “జీహెచ్ఎంసీ పరిధిలో చుట్టుపక్కల 27 మున్సిపాలిటీలను విలీనం చేశారు. కానీ కంటోన్మెంట్ మాత్రమే విలీనం కాకపోవడం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో కలిపితేనే నిధులు వచ్చి కార్పొరేటర్ పనులు చేయించగలుగుతారు” అని ఆమె స్పష్టం చేశారు.రామన్న చెరువు మరమ్మతులు, శాశ్వత పరిష్కారాల కోసం జాగృతి శాయశక్తులా కృషి చేస్తుందని కవిత హామీ ఇచ్చారు. “చెరువు పునరుద్ధరణకు, వరద ప్రమాదం లేకుండా చర్యలు తీసుకునేందుకు మేము ప్రజల పక్షాన నిలబడతాం” అని ఆమె తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments