కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు.
– జనగామలో అభినందన సభలో ఘాటు వ్యాఖ్యలు.
– సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకత్వంపై నిప్పులు.
– రైతులు, మహిళలు, నిరుద్యోగుల అంశాలపై ప్రశ్నల వర్షం.
జనం వాయిస్, జనగామ:
జనగామ పట్టణంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్‌లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల అభినందన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రికి పాలనపై అవగాహన లేదని, నీళ్ల అంశాలపై కూడా స్పష్టత లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గోదావరి, భాక్రా నంగల్ వంటి ప్రాజెక్టులపై అసత్య వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కనిపించడం లేదని, రైతులు యూరియా కోసం చలిలో లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎనకటి రోజులు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అడ్డగోలుగా మాట్లాడటం తగదని అన్నారు. ఇంటింటికీ నీళ్లు, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్‌కేనని పేర్కొన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని కేటీఆర్ విమర్శించారు. ఎకరానికి రైతుబంధు, కౌలుదారులకు సాయం, పంట బోనస్, ప్రభుత్వ ఉద్యోగాల హామీలతో ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. ఈ హామీలకు కారణంగా రాహుల్ గాంధీ ని కేటీఆర్ విమర్శించారు. మహిళలకు ఆర్థిక భద్రత, బతుకమ్మ చీర, బంగారం వంటి హామీలు అమలు చేయలేదని, ప్రజల మధ్య సీఎం ప్రవర్తన కూడా వివాదాస్పదంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments