సిబిల్ స్కోర్ తక్కువా..?
– లోన్లు, క్రెడిట్ కార్డులు రావట్లేదా..?
జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 26:
అత్యవసర అవసరాల కోసం బ్యాంకుల వద్ద రుణాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో చాలామందికి ఎదురయ్యే ప్రధాన అడ్డంకి సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే ఏ బ్యాంక్ అయినా లోన్ ఇవ్వడానికి వెనుకాడుతుంది. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు మరింత ఒత్తిడికి లోనవుతుంటారు. అయితే సరైన అలవాట్లు పాటిస్తే సిబిల్ స్కోర్‌ను క్రమంగా మెరుగుపర్చుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 మధ్య లెక్కించబడుతుంది. 800కి పైగా ఉన్న స్కోర్‌ను అద్భుతమైన స్థాయిగా పరిగణిస్తారు. 700 నుంచి 800 మధ్య ఉంటే సరైన స్థాయి అని చెబుతారు. 700 కంటే తక్కువ ఉంటే లోన్లు, క్రెడిట్ కార్డులు పొందడం కష్టమవుతుంది. ప్రస్తుతం దేశంలో కేవలం 10 నుంచి 20 శాతం మందికే 800కి పైగా సిబిల్ స్కోర్ ఉందని అంచనా. ఆర్థిక వ్యవహారాలపై అవగాహన ఉన్నవారు, చెల్లింపుల్లో క్రమశిక్షణ పాటించే వారికే సాధారణంగా ఈ స్థాయి స్కోర్ ఉంటుంది.సిబిల్ స్కోర్ పెరగాలంటే ముందుగా లోన్ల ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులను గడువు తేదీ లోపే చెల్లించాలి. ఒక్కరోజు ఆలస్యం అయినా అది స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే క్రెడిట్ కార్డు వినియోగం కూడా పరిమితిలోనే ఉండాలి. మీ కార్డు లిమిట్ రూ.1 లక్ష ఉంటే అందులో రూ.30,000 కంటే ఎక్కువ వాడకుండా ఉండటం మంచిది. దీనిని క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటారు. ఇది 30 శాతం లోపే ఉంటే స్కోర్ మెరుగుపడుతుంది.ఇక లోన్ల విషయంలో సమతుల్యత చాలా ముఖ్యం. పర్సనల్ లోన్, స్టూడెంట్ లోన్, క్రెడిట్ కార్డులు భద్రత లేని రుణాలుగా పరిగణిస్తారు. హోమ్ లోన్, వాహన రుణం, గోల్డ్ లోన్ లాంటి వాటిని భద్రతతో కూడిన రుణాలుగా గుర్తిస్తారు. ఈ రెండు రకాల రుణాలు కలిపి ఉండటం సిబిల్ స్కోర్‌కు మంచిదిగా భావిస్తారు. ఒకే రకమైన లోన్లపై మాత్రమే ఆధారపడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.అత్యంత ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. రుణాలు చెల్లించలేక సెటిల్‌మెంట్ చేసుకుంటే సిబిల్ స్కోర్ భారీగా పడిపోతుంది. అది చాలా సంవత్సరాల వరకు ప్రభావం చూపుతుంది. అలాగే తరచూ లోన్లు, క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేయడం కూడా స్కోర్‌ను తగ్గిస్తుంది. ప్రతి అప్లికేషన్ ఒక హార్డ్ ఎంక్వైరీగా నమోదు అవుతుంది. ఇవన్నీ నియంత్రణలో ఉంచితే కొద్ది నెలల్లోనే సిబిల్ స్కోర్ క్రమంగా పెరుగుతుంది.
మొత్తానికి సరైన ఆర్థిక క్రమశిక్షణ, సమయపాలన అలవాటు చేసుకుంటే సిబిల్ స్కోర్‌ను 800కి పైగా తీసుకెళ్లడం అసాధ్యం కాదు. అప్పుడు లోన్లు, క్రెడిట్ కార్డులు సులభంగా లభించడమే కాకుండా తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశమూ లభిస్తుంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments