EPAPER
Sunday, February 15, 2026
Google search engine

కోట్లాది భక్తుల రాకకు సమగ్ర ప్రణాళిక

📰 Generate e-Paper Clip

కోట్లాది భక్తుల రాకకు సమగ్ర ప్రణాళిక

మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర.

– రైలు–బస్ అనుసంధానంతో పకడ్బందీ ఏర్పాట్లు.

– 28 ప్రత్యేక రైళ్లు – వరంగల్, కాజీపేట కేంద్రంగా సేవలు

జనం వాయిస్, ములుగు:


ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఈ నెల 28న ప్రారంభం కానుంది. కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. రవాణా విషయంలో దక్షిణ మధ్య రైల్వే మరియు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మొత్తం 28 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. మేడారానికి నేరుగా రైలు మార్గం లేకపోవడంతో సమీప ప్రధాన స్టేషన్లైన వరంగల్, కాజీపేటలకు ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ నెల 28, 29 తేదీల్లో సికింద్రాబాద్–మంచిర్యాల–సిర్పూర్ కాగజ్‌నగర్, నిజామాబాద్–వరంగల్, కాజీపేట–ఖమ్మం, ఆదిలాబాద్ వంటి మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. దీని వల్ల హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సులభమవుతుంది.
స్టేషన్ నుంచే నేరుగా గద్దెలకు బస్సులు
రైళ్ల ద్వారా వరంగల్, కాజీపేట స్టేషన్లకు చేరుకున్న భక్తులు నేరుగా మేడారం గద్దెల వద్దకు వెళ్లేందుకు టీజీఎస్ఆర్‌టీసీ భారీగా బస్సులను సిద్ధం చేసింది. రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లోనే ప్రత్యేక బస్ పాయింట్లు ఏర్పాటు చేసి నిరంతరాయంగా సర్వీసులు నడుపుతారు. రైలు దిగిన వెంటనే బస్సు అందుబాటులో ఉండేలా రైల్వే–ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఈ రవాణా సౌకర్యాలు జాతర ముగిసే జనవరి 31 వరకు కొనసాగుతాయి.
హెలికాప్టర్ సేవలు – ఈసారి ప్రత్యేక ఆకర్షణ
ఈసారి ప్రత్యేక ఆకర్షణగా హనుమకొండ నుంచి మేడారానికి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రానుపోను ప్రయాణానికి సుమారు రూ.35,999 ఖర్చవుతుందని నిర్వాహకులు తెలిపారు. సొంత వాహనాలు లేనివారు లేదా ప్రైవేట్ వాహనాల అధిక ఛార్జీల నుంచి తప్పించుకోవాలనుకునే భక్తులకు రైలు–బస్ అనుసంధానం గొప్ప అవకాశం. ఈ ఏర్పాట్లతో భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా వనదేవతల దర్శనం చేసుకోగలరని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!