EPAPER
Monday, February 16, 2026
Google search engine

పాకిస్థాన్ జౌళి పరిశ్రమ కుదేలు.

📰 Generate e-Paper Clip

పాకిస్థాన్ జౌళి పరిశ్రమ కుదేలు.

-ఎగుమతులు పడిపోతూ… ఫ్యాక్టరీలు మూత
పత్తి కొరతతో రైతుల వెనుకడుగు.
-విద్యుత్ చార్జీలు, విధాన లోపాలే ప్రధాన కారణాలు.

జనం వాయిస్, ఇస్లామాబాద్, జనవరి 01:


ఒకప్పుడు పాకిస్థాన్ ఆర్థిక వృద్ధికి కీలకంగా నిలిచిన జౌళి పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పెరిగిన ఉత్పత్తి ఖర్చులు, అధిక విద్యుత్ చార్జీలు, తగ్గిన పత్తి దిగుబడి కారణంగా దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలు వరుసగా మూతపడుతున్నాయి. ఈ దుస్థితిపై యూకేకు చెందిన డైలీ మిర్రర్ పత్రిక కథనం ప్రచురించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ టెక్స్‌టైల్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం, పాకిస్థాన్ టెక్స్‌టైల్ ఎగుమతులు వరుసగా నాలుగో నెలలోనూ తగ్గాయి. గత ఏడాది జూలై నుంచి నవంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 6.39 శాతం తగ్గి 12.844 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు పీటీఈఏ జనరల్ సెక్రటరీ అజీజుల్లా గోహీర్ తెలిపారు. ఒకప్పుడు 19.3 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు క్రమంగా 17 బిలియన్ డాలర్లకు, అక్కడి నుంచి మరింత దిగజారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత్, బంగ్లాదేశ్, చైనా, వియత్నాం వంటి దేశాలు తక్కువ ఖర్చుతో వస్త్రాలు ఉత్పత్తి చేస్తూ ప్రపంచ మార్కెట్లో పాకిస్థాన్ వాటాను తగ్గిస్తున్నాయి. ఈ దేశాల్లో స్థిరమైన విధానాలు, తక్కువ విద్యుత్ చార్జీలు ఉండటంతో పాక్ పరిశ్రమలు వాటితో పోటీపడలేకపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్‌లో పత్తి ఉత్పత్తి కూడా తీవ్రంగా పడిపోయింది. ఒకప్పుడు 15 మిలియన్ బేళ్లుగా ఉన్న దిగుబడి ప్రస్తుతం కేవలం 5.5 మిలియన్ బేళ్లకు తగ్గిందని పాకిస్థాన్ కాటన్ జిన్నర్స్ ఫోరం ఛైర్మన్ ఇహసానుల్ హక్ తెలిపారు. ఇప్పటికే 100 స్పిన్నింగ్ మిల్లులు, 400 జిన్నింగ్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయని చెప్పారు. పత్తి ధరలు పడిపోవడంతో రైతులు చెరకు సాగు వైపు మళ్లుతున్న పరిస్థితి నెలకొంది.
అధిక విద్యుత్ చార్జీలు, పన్నుల భారం, తరచూ విద్యుత్ కోతలు, విధాన మార్పులు, రవాణా సమ్మెలు జౌళి రంగాన్ని మరింత కుదేలుచేస్తున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన సంస్కరణలు తీసుకురాకపోతే పాకిస్థాన్ జౌళి పరిశ్రమ భవిష్యత్తు మరింత అనిశ్చితంగా మారే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!