మేడారం జాతర అనంతరం చెత్త కుప్పలు.
– పారిశుద్ధ్య కార్మికులకు పెను సవాల్.
జనం వాయిస్, మేడారం, ఫిబ్రవరి 07:
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర వైభవంగా ముగిసింది. కోట్లాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుని స్వస్థలాలకు చేరుకున్న అనంతరం, మేడారం పరిసర ప్రాంతాలు మాత్రం టన్నుల కొద్దీ చెత్తతో నిండిపోయాయి. ఈ వ్యర్థాలను తొలగించడం ఇప్పుడు అధికార యంత్రాంగానికి, పారిశుద్ధ్య సిబ్బందికి పెద్ద సవాల్‌గా మారింది. మేడారం కేంద్రంగా కన్నెపల్లి, నార్లాపూర్, కొంగల గట్టు తదితర ప్రాంతాల్లో దాదాపు 3 వేల టన్నుల వరకు చెత్త పేరుకుపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు వదిలివెళ్లిన ప్లాస్టిక్, గాజు సీసాలు, ఆహార వ్యర్థాలతో పాటు జంతువులు, కోళ్ల అవశేషాలు భారీగా పేరుకుపోయాయి. ముఖ్యంగా ఈ జంతు వ్యర్థాలు కుళ్లిపోవడంతో పరిసర ప్రాంతమంతా తీవ్ర దుర్గంధంతో నిండిపోయింది. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు సుమారు 6 వేల మంది పారిశుద్ధ్య కార్మికులను రంగంలోకి దింపారు. యుద్ధప్రాతిపదికన చెత్త తొలగింపు, శుభ్రతా కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ పనిభారం తీవ్రంగా ఉందని అధికారులు చెబుతున్నారు. అడవులు, కొండ ప్రాంతాలు కావడంతో యంత్రాలు పూర్తిస్థాయిలో ఉపయోగించలేకపోతుండటం సమస్యను మరింత క్లిష్టంగా మారుస్తోంది. అయితే, ఈ పనుల్లో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. “రోడ్లు, ప్లాస్టిక్ క్లీనింగ్ పని అని చెప్పి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ జంతువుల తోళ్లు, తలకాయలు, కోళ్ల వ్యర్థాలు గుట్టలుగా ఉన్నాయి. వాటిని చూస్తుంటేనే వాంతులు వస్తున్నాయి. ఇంత గలీజు పని మేమెప్పుడూ చేయలేదు” అని కొందరు కార్మికులు వాపోయారు. అమ్మవార్ల దయతోనే ఈ పని చేస్తున్నామని, లేకపోతే తట్టుకోవడం కష్టమని వారు కన్నీటిపర్యంతమయ్యారు. అధికారుల లెక్కల ప్రకారం జాతరలో పోగైన వ్యర్థాల్లో సుమారు 48 శాతం ప్లాస్టిక్, గాజు సీసాల వంటి పర్యావరణానికి హానికరమైన పదార్థాలే ఉన్నాయి. దాదాపు 100 టన్నుల ఖాళీ బాటిళ్లు ఉండగా, వాటిలో చాలా వరకు పగిలిపోయి ప్రమాదకరంగా మారాయి. మిగిలిన 52 శాతం బియ్యం, బెల్లం వంటి భూమిలో కలిసిపోయే వ్యర్థాలుగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం చెత్తను వర్గీకరించి, మేడారం ప్రాంగణాన్ని పూర్తిగా శుభ్రపరిచే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments