రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో నకిలీ వాట్సాప్ కలకలం.
– “ఆ నంబర్ నాది కాదు.. వెంటనే బ్లాక్ చేయండి”
జనం వాయిస్,ముంబయి, నవంబర్ 25:
సోషల్ మీడియా విస్తరణతో పాటు సైబర్ మోసగాళ్ల చలాకీతనం కూడా రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో ఓ నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించి ప్రజలను మోసం చేస్తున్న ఘటన బయటపడింది. కొంతమంది కేటుగాళ్లు ఆమె ఫోటోను ప్రొఫైల్ చిత్రంగా పెట్టుకుని, బయోలో ఆమె నటించిన సినిమాల పేర్లు చేర్చి నమ్మకం కలిగించేలా ప్రయత్నించారు. 8111067586 అనే నంబర్ ద్వారా పలువురికి రకుల్ పేరుతో సందేశాలు పంపినట్లు సమాచారం.
ఈ విషయం తన దృష్టికి రాగానే రకుల్ వెంటనే స్పందించారు. ఆ నకిలీ చాట్ల స్క్రీన్‌షాట్లను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. “ఆ నంబర్ నాది కాదు. దయచేసి ఆ నంబర్ నుంచి వచ్చే మెసేజులకు స్పందించకండి. వెంటనే బ్లాక్ చేయండి” అంటూ ఆమె స్పష్టం చేశారు. తనతో సంబంధం లేని నంబర్ల నుంచి ఎవరికీ వ్యక్తిగతంగా సందేశాలు పంపనని, తన అధికారిక టీమ్ ద్వారానే అన్ని కమ్యూనికేషన్లు జరుగుతాయని తెలిపారు.
ఇలాంటి నకిలీ అకౌంట్ల బారిన ఇంతకుముందూ పలువురు నటీమణులు పడిన సంగతి తెలిసిందే. అదితి రావు హైదరి, రుక్మిణి వసంత్ వంటి సెలబ్రిటీలు కూడా తమ పేర్లతో సృష్టించిన ఫేక్ నంబర్లను ఖండిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. రకుల్ ఘటనతో మళ్లీ ఒకసారి సెలబ్రిటీల పేరుతో జరిగే సైబర్ మోసాల ముప్పు ఎంత తీవ్రంగా ఉందో బయటపడింది.
సైబర్ నిపుణుల మాటల్లో ఇలాంటి అనుమానాస్పద నంబర్లపై స్పందించకుండా వెంటనే బ్లాక్ చేయడం, అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే సమాచారం మాత్రమే నమ్మడం అవసరమని సూచిస్తున్నారు. ప్రజలు కూడా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని వారు హెచ్చరిస్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments