జాహ్నవి కందుల కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం.
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి.
29 మిలియన్ డాలర్ల ఒప్పందానికి సియాటెల్ అంగీకారం.
పోలీసు అధికారి నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు.
జనం వాయిస్, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:
అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో మృతి చెందిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి 29 మిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వడానికి సియాటెల్ నగరం ఒప్పందం కుదుర్చుకుంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.262 కోట్లకు సమానం. 2023 జనవరి 23న సియాటెల్‌లో రోడ్డు దాటుతున్న సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టడంతో జాహ్నవి మరణించారు. సియాటెల్ నగర న్యాయవాది ఎరికా ఇవాన్స్ ఈ పరిహారంపై ప్రకటన విడుదల చేశారు. జాహ్నవి మృతి చాలా బాధాకరమని, ఈ పరిహారం ఆమె కుటుంబానికి కొంత ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందంపై జాహ్నవి కుటుంబం నుంచి ఇంకా స్పందన రావాల్సి ఉంది. ఇరుపక్షాలు గత వారం కోర్టులో పరిహార ఒప్పందానికి సంబంధించిన దరఖాస్తు దాఖలు చేసినట్లు సమాచారం. జాహ్నవి సౌత్ లేక్ యూనియన్ ప్రాంతంలోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ కోసం 2021లో అమెరికా వెళ్లారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాహనాల వేగ పరిమితి 40 కిలోమీటర్లుగా ఉండగా, సంబంధిత పోలీసు అధికారి 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపినట్లు వెల్లడైంది. ఢీకొట్టిన దెబ్బకు జాహ్నవి సుమారు 100 అడుగుల దూరం ఎగిరిపడినట్లు నివేదికలు సూచించాయి. ప్రమాదం అనంతరం పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు అమెరికాలోనూ వ్యతిరేకత వ్యక్తమైంది. అనంతరం సంబంధిత అధికారిని విధుల నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments