EPAPER
Sunday, April 5, 2026
Google search engine

తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం చిలకలూరిపేట నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక.

📰 Generate e-Paper Clip

తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం
చిలకలూరిపేట నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక.

జనం వాయిస్, చిలకలూరిపేట:

తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం చిలకలూరిపేట నియోజకవర్గం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా చిలకలూరిపేట లోని మెట్రో ఉదయం కార్యాలయంలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. శ్రీను నాయక్ పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.

నూతన కార్యవర్గ వివరాలు:

2026-27 సంవత్సరానికి గాను నూతన బాధ్యతలు స్వీకరించేలా కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. అధ్యక్షులు గా తుర్లపాటి వెంకట నగేష్, ఉపాధ్యక్షులు బత్తుల విక్రమ్, ప్రధాన కార్యదర్శి గొట్టిపాటి సీతారామయ్య, సహాయ కార్యదర్శి బి. రాంబాబు నాయక్, కోశాధికారి సిహెచ్. హరి ప్రసాద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ముఖ్య అంశాలు, డిమాండ్లు:

సమావేశం అనంతరం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. శ్రీను నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వంపై పలు డిమాండ్లను సంధించారు. గతంలో ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, గృహ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చిందని, కానీ ప్రస్తుతం ఆ ఊసే ఎత్తకపోవడం శోచనీయమని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సంఘం తరపున ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుల మార్గదర్శకత్వంలో ప్రతి జర్నలిస్టుకు రూ. 15-20 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతీ ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టుల ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించేందుకు “ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు పురస్కారాలు” అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూనే, ప్రజల పక్షాన నిలబడి వార్తలు రాయాలని నూతన కమిటీ తీర్మానించింది. క్రమశిక్షణతో కూడిన జర్నలిజం చేస్తూ, ప్రతి నెలా సమావేశమై సంఘ బలోపేతానికి కృషి చేయాలని సభ్యులకు సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ, తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!