EPAPER
Thursday, April 2, 2026
Google search engine

తిరుపతి భక్తులకు కొత్త అనుభూతి – త్వరలో కారవాన్ బస్సులు

📰 Generate e-Paper Clip

తిరుపతి భక్తులకు కొత్త అనుభూతి – త్వరలో కారవాన్ బస్సులు

– కారవాన్ పర్యాటకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

– రెండు–మూడు రోజులు తిరుపతి, పరిసర ప్రాంతాల సందర్శనకు ప్రోత్సాహం.

– ఏపీటిడిసి ఆధ్వర్యంలో ట్రావెల్స్ యాజమాన్యాలతో చర్చలు.

– వేలాదిమందికి ఉపాధి అవకాశాలు.

జనం వాయిస్, తిరుపతి:


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. తిరుపతికి వచ్చే భక్తులకు కొత్త అనుభూతిని అందించే దిశగా కారవాన్ పర్యాటకాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు, ఒకరోజు దర్శనంతోనే తిరిగి వెళ్లే భక్తులను రెండు, మూడు రోజుల పాటు తిరుపతి, పరిసర పర్యాటక ప్రాంతాలు సందర్శించేలా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ వినూత్న విధానాన్ని అమలు చేయనున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే ప్రత్యేక కారవాన్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. తిరుపతికి నానాటికీ పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని, వారికి ఆధునిక సౌకర్యాలతో కూడిన పర్యాటక అనుభూతి అందిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కారవాన్ పర్యాటకం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభించనుంది.
కారవాన్ బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పలు ట్రావెల్స్ యాజమాన్యాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే మూడు ట్రావెల్స్ సంస్థలు పర్యాటక శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలో ఒప్పందాల వివరాలు, ప్యాకేజీలను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కారవాన్‌లలో రెండు కుటుంబాలు ఒకేసారి ప్రయాణించవచ్చు. ఒక్కో బస్సులో 10 నుంచి 15 మంది వరకు సౌకర్యవంతంగా ప్రయాణించేలా ఏర్పాట్లు ఉంటాయి. ఏసీ పడక గదులు, హాలు, వంటగది, మరుగుదొడ్లు, సోఫాలు, టీవీ, మ్యూజిక్ సిస్టం, వైఫై వంటి ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. వంటగది సౌకర్యం ఉండటంతో ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు ఇబ్బందులు లేకుండా భక్తులు ప్రయాణం చేయవచ్చు.
కారవాన్ అద్దెలను 24 గంటల కాలపరిమితితో, కిలోమీటర్ల ఆధారంగా వసూలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కనీస కిలోమీటర్లు ప్రయాణించాల్సిన నిబంధనను కూడా అమలు చేయనున్నారు. ప్యాకేజీల ధరలు, నిబంధనలపై మార్గదర్శకాలు సిద్ధమైన వెంటనే ఒప్పందాల ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. త్వరలోనే తిరుపతి భక్తులకు కారవాన్ పర్యాటక సేవలు అందుబాటులోకి రానున్నాయి.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!