కరచాలనం లేకుండానే టాస్..భారత్ బంగ్లా మధ్య ఉద్రిక్తతలు బహిర్గతం.!
జనం వాయిస్, బులవాయో:
భారత్ బంగ్లాదేశ్ మధ్య క్షీణిస్తున్న సంబంధాల ప్రభావం క్రీడామైదానంలోనూ స్పష్టంగా కనిపించింది. బులవాయో వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు సంప్రదాయంగా జరిగే కరచాలనం చేయకుండా నేరుగా టాస్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ ఘటన అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
వర్షం కారణంగా కొద్దిసేపు ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ ఆయుష్ మ్హత్రే, బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ టాస్ కోసం మైదానంలోకి వచ్చారు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకోకుండా ఇంటర్వ్యూలు ముగించుకుని పెవిలియన్‌కు వెళ్లిపోయారు.
గత కొంతకాలంగా భారత్ ప్రత్యర్థి దేశాలతో కరచాలనం చేయకుండా ఉండే విధానాన్ని అనుసరిస్తోంది. గతంలో పాకిస్థాన్‌తో జరిగిన పలు అంతర్జాతీయ టోర్నీల్లోనూ ఇదే విధానం కొనసాగింది. ఇప్పుడు అదే విధానం బంగ్లాదేశ్‌కూ వర్తించడం గమనార్హం.
ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న కొన్ని హింసాత్మక ఘటనలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీశాయి. అలాగే బంగ్లాదేశ్ క్రికెట్‌కు సంబంధించిన కొన్ని వివాదాలు కూడా పరిస్థితిని సంక్లిష్టంగా మార్చాయి. భద్రతా కారణాలను చూపుతూ తమ మ్యాచ్‌లను మరో దేశానికి తరలించాలని బంగ్లాదేశ్ కోరడం కూడా ఉద్రిక్తతలను పెంచింది.
ఈ పరిణామాలన్నీ కలిసి ఇప్పుడు క్రికెట్ మైదానంలోనూ ప్రతిఫలిస్తున్నాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రీడల్లో స్నేహభావం తగ్గిపోతుండటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments