ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం మహిళల కొట్లాట.. వైరల్ అయిన వీడియో.
పరిగి-హైదరాబాద్ బస్సులో సీట్ల కోసం మహిళల తీవ్ర ఘర్షణ.
సోషల్ మీడియాలో వైరల్ అయిన కొట్లాట వీడియో.
ఈ ఘటనపై ఇంకా స్పందించని టీజీఎస్‌ఆర్టీసీ, పోలీసులు.
జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 13:
మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పరిగి నుంచి హైదరాబాద్ వెళుతున్న టీజీఎస్‌ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం కొందరు మహిళలు తీవ్రంగా కొట్టుకున్నారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని, పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఉచిత ప్రయాణ పథకం వల్ల బస్సుల్లో పెరిగిన రద్దీ, తలెత్తుతున్న వివాదాలపై మళ్లీ చర్చ మొదలైంది.
వివరాల్లోకి వెళితే, వికారాబాద్ జిల్లా పరిగి నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న బస్సులో ఈ గొడవ జరిగింది. వినాయక చవితి పండుగ నేపథ్యంలో బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో సీటు విషయంలో నలుగురు మహిళల మధ్య వాగ్వాదం మొదలై, అది తీవ్ర ఘర్షణకు దారితీసింది. తోటి ప్రయాణికులు వారిని విడదీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ గొడవతో ఇబ్బందిపడిన కొందరు ప్రయాణికులు బస్సు దిగి వెళ్లిపోయినట్లు సమాచారం.
తెలంగాణలో ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే, పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో తరచూ ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. ఒక మంచి పథకాన్ని ఇలాంటి ఘటనలతో అపహాస్యం చేస్తున్నారని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు.