EPAPER
Sunday, February 15, 2026
Google search engine

మావోయిస్టు హిడ్మా ఎక్కడ?.. కర్రెగుట్టల నుంచి ఎక్కడికెళ్లాడు!

📰 Generate e-Paper Clip

మావోయిస్టు హిడ్మా ఎక్కడ?.. కర్రెగుట్టల నుంచి ఎక్కడికెళ్లాడు!

జనం వాయిస్ దినపత్రిక:

మావోయిస్టుల మూకుమ్మడి లొంగుబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో కీలక మిలిటరీ నేత, ఫస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా ఎక్కడ ఉండి వుంటాడన్న చర్చ దేశమంతటా అన్ని వర్గాల్లో జోరుగా నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర కమిటీల నేతలే సాయుధ పోరాట విరమణ ప్రకటించి, ఆయుధాలు అప్పగిస్తుంటే.. ఏ మాత్రం అదరకుండా, బెదరకుండా పార్టీ లైనును కొనసాగిస్తున్న హిడ్మా పట్టుకోకపోతే నక్సలిజం నిర్మూలన పూర్తి అయినట్టు కాదని ఛత్తీస్‌గఢ్ పోలీసులు అంటున్నారు. అప్పటి వరకూ ఆపరేషన్ కగార్ ఆగబోదని స్పష్టం చేస్తున్నారు. 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన చింతల్నారు దాడి నుంచి మహేంద్ర కర్మ సహా పలువురు కాంగ్రెస్ నేతలను, పోలీసులను పొట్టన పెట్టుకున్న జీరం ఘాటీ ఆంబుష్ వరకూ నేతృత్వం వహించింది హిడ్మాయేనని వాళ్లు మండిపడుతున్నారు.కాగా, ఇటీవలే డీకేఎస్‌జడ్సీ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యునిగా నియమితుడైన హిడ్మా, పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి@దేవ్‌జీల పైనే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ భవిష్యత్తు ఆధారపడి వుందని ఆ పార్టీ సానుభూతిపరులు, మాజీ నక్సలైట్లు అభిప్రాయపడుతున్నారు. హిడ్మాను కాపాడుకోవడం ప్రస్తుతం ఆ పార్టీ లక్ష్యమని అంటున్నారు. హిడ్మా కనుక బతికి వుంటే తిరిగి పార్టీ ఆదివాసుల్లో బలం పుంజుకోవడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బస్తర్ పోలీసుల నుంచి కీలక సమాచారం లీకైంది. ఇటీవలే లొంగిపోయిన హిడ్మా అనుచరుడు లక్మూ పోలీసులకు ఆయన ఆనుపానుల గురించిన సమాచారం అందించాడని అంటున్నారు. ఏప్రిల్‌లో జరిగిన కర్రెగుట్టల ఆపరేషన్ నుంచి తృటిలో తప్పించుకున్న హిడ్మా, ఆయన బెటాలియన్.. మే, జూన్‌లలో బసవరాజ్ సహా పలువురు నేతల ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో తిరిగి కర్రెగుట్టల పైకి వచ్చారని చెబుతున్నారు. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ నేతలు, గెరిల్లాలతో కలిసి సరిహద్దు దాటాడని, వారి రక్షణలోనే ఉన్నాడని లక్మూ చెప్పినట్టు సమాచారం. ఇదే నిజమైతే త్వరలోనే మరోసారి ‘‘ఆపరేషన్ కర్రెగుట్టలు’’ను కేంద్ర బలగాలు చేపట్టే అవకాశముందని బస్తర్ మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ మావోయిస్టు వ్యతిరేక చర్యలకు సంబంధించి ఇది అడ్డు కాబోదని వివరిస్తున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!