సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు.
– కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రాస్తారోకో.
– నాగార్జున సాగర్ నుంచి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్.
జనం వాయిస్, ఖమ్మం జిల్లా:
సాగునీటి కొరతతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఖమ్మం జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద ఏస్కూరు–పల్లిపాడు రహదారిపై రైతులు రాస్తారోకోకు దిగారు. సాగు నీరు లేకపోవడంతో మొక్కజొన్న పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని, వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ నుంచి అధికారులు సాగునీటిని విడుదల చేయకపోవడమే సమస్యకు కారణమని రైతులు ఆరోపించారు. ఈ విషయమై స్థానిక నాయకులను, అధికారులను కలిసినా స్పందన లేదని వాపోయారు. చివరకు తమ సమస్యను ప్రభుత్వానికి తెలియజేయడానికి నిరసన బాట పట్టామని తెలిపారు. రైతుల ఆందోళనతో ఏస్కూరు–పల్లిపాడు రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు.
సాగునీటి సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని, నాగార్జున సాగర్ నుంచి తక్షణమే నీటి విడుదల చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. తమ పంటలు కాపాడకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments