EPAPER
Monday, March 16, 2026
Google search engine

హన్మకొండ కలెక్టరేట్ వద్ద యువకుడి హల్‌చల్.

📰 Generate e-Paper Clip

హన్మకొండ కలెక్టరేట్ వద్ద యువకుడి హల్‌చల్.

భూమి వివాదంపై కలెక్టరేట్ భవనం ఎక్కి ఆత్మహత్యాయత్నం.
ఏళ్లుగా తిరుగుతున్నా న్యాయం జరగలేదని ఆవేదన.
ఎమ్మార్వో, సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.

జనం వాయిస్, హన్మకొండ, మార్చి 16:

హన్మకొండ కలెక్టరేట్ వద్ద ఒక యువకుడు కలకలం రేపాడు. తమ కుటుంబ భూమిని వేరే వారికి అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ కలెక్టరేట్ భవనం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలిసిన వెంటనే అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పయ్యావుల సాంబరాజు అనే యువకుడు ఈ చర్యకు పాల్పడినట్లు గుర్తించారు. తమ భూమి సమస్యపై ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో పలుమార్లు అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయిందని ఆరోపించాడు.
న్యాయం కోసం పోరాటం చేస్తుంటే తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని కూడా యువకుడు ఆరోపించాడు. అధికారుల నిర్లక్ష్యంతోనే తాను ఈ స్థాయికి వెళ్లాల్సి వచ్చిందని తెలిపాడు. ఈ ఘటన అక్కడికి వచ్చిన ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ధర్మసాగర్ ఎమ్మార్వో సదానందం, సీఐ శ్రీధర్ రావు బాధ్యులని యువకుడు ఆరోపించాడు. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాడు. తన కుటుంబ భూమి విషయంలో న్యాయం చేయాలని అధికారులను కోరాడు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. భవనం ఎక్కిన యువకుడిని కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!