వేయి ఏళ్ల విశ్వాసం .. వేములవాడ రాజన్న
- కోరిన కోరికలు తీర్చే.. కొంగు బంగారం..
- ఆది, సోమవారాలలో వందలాది కోడెలతో ఆలయ ప్రాంగణం.
- తెలంగాణ కాశిగా పేరుగాంచిన దక్షిణ కాశి క్షేత్ర మహిమ.
జనం వాయిస్, వెబ్ డెస్క్, జూలై 12:

దక్షిణ కాశీగా వెలిసిన ఓ రాజన్న….
కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షమన్న..
నీ గుడికి వచ్చే భక్తుల గుండెల్లోన..నీ నామస్మరణే నిరంతరం వినబడును..
కోడెలను కట్టి నీకు మొక్కులు చెల్లిస్తే..పాపాలన్నీ తొలగి పుణ్యాలు దక్కును..
ధర్మగుండంలో పవిత్ర స్నానమాచరిస్తే సకల రోగాలు మటుమాయమైపోవును రాజన్న
వేములవాడ పురమున కొలువైన ఈశ్వరా…శ్రీ రాజరాజేశ్వరునిగా బ్రోచే పరమేశ్వరా…హరిహర క్షేత్రమై విలసిల్లేటి పుణ్యధామమా..నీ దర్శనమే మా జన్మకు ధన్యత్వమా..
శాంతిసౌభాగ్యాలనిచ్చే చల్లని తండ్రివి..ఆర్తుల పాలిట కొంగుబంగారమైన స్వామివి…నీ లీలలు అనంతం, నీ కరుణ అపారం…
వేములవాడ రాజన్నకే మా శతకోటి వందనం
తెలంగాణ గుండెల్లో వెలసిన పుణ్యక్షేత్రం వేములవాడ. ” కోరిన కోరికలు తీర్చే కోడెగూళ్ల రాజు” గా భక్తులచే పూజలందుకుంటున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వేయి సంవత్సరాల చరిత్ర కలిగిన దివ్య క్షేత్రం. కాశీకి వెళ్లలేని వారు వేములవాడకు వస్తే చాలని అదే పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం..
ఆవిర్భావ కథ..
సుమారు 1000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఒక రైతు పొలం దున్నుతుండగా అతని నాగలికి ఏదో గట్టిగా తగిలింది. మట్టిని తొలగించి చూడగా స్వయంభూ శివలింగం దర్శనమిచ్చింది. ఆ రాత్రి ఆ రైతుకు కలలో పరమశివుడు కనిపించి, నేను ఈ స్థలంలోనే ఉన్నాను. నాకు ఇక్కడ ఆలయం నిర్మించు అని ఆదేశించాడు.
ఆ తర్వాత చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అప్పటి నుండి ఈ క్షేత్రం “వేములవాడ” గా ప్రసిద్ధి చెంది. వేపచెట్ల మధ్య వెలసినందున ఈ పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు.
పాపాలను కడిగే పుష్కరిణి
ఆలయానికి ముందు ఉన్న “ధర్మగుండం” ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణ. సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పవిత్ర పుష్కరిణిలో భక్తులు ముందుగా స్నానం ఆచరించి, తడి బట్టలతోనే స్వామి దర్శనానికి వెళ్తారు.
“ఈ గుండంలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. కాశీలో గంగాస్నానం చేసిన ఫలితం ఇక్కడ దొరుకుతుంది” అని ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర్ శర్మ గారు తెలిపారు. కార్తీక మాసంలో, శివరాత్రి రోజున లక్షలాది భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తారు.
కోడె మొక్కు – భక్తికి ప్రతీక
వేములవాడ రాజన్న దగ్గర అత్యంత ప్రసిద్ధి చెందినది “కోడె మొక్కు”. భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత స్వామికి కృతజ్ఞతగా ఆలయం చుట్టూ కోడెను ప్రదక్షిణ చేయిస్తారు. 5, 11, 21 ప్రదక్షిణలు చేసే ఆచారం ఉంది.
కోడె మెడలో పూలదండ వేసి, కాళ్లకు గజ్జెలు కట్టి భక్తితో ఊరేగిస్తారు. “కోడె కూత విన్న వెంటనే రాజన్న కరుణిస్తాడు” అనేది తరతరాలుగా వస్తున్న నమ్మకం. ఆది, సోమ వారాల్లో వందలాది కోడెలతో ఆలయ ప్రాంగణం భక్తి శోభతో నిండిపోతుంది.
ఆలయ విశేషాలు.
ప్రధాన దైవం: శ్రీ రాజరాజేశ్వర స్వామి స్వయంభూ లింగ రూపంలో కొలువై ఉన్నాడు. పక్కన రాజరాజేశ్వరి అమ్మవారు ఉన్నారు.
సమయాలు: ఉదయం 5:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు భక్తులకు దర్శనం.
ప్రత్యేక పూజలు:
సోమవారం, ప్రదోషం, శివరాత్రి, కార్తీక సోమవారాల్లో వేలాదిగా భక్తులు..
ఎలా చేరుకోవాలి: అన్ని బస్సు స్టాండ్ల నుండి ప్రతి 30 నిమిషాలకు TSRTC బస్సులు ఉన్నాయి.
పూజారి సందేశం
“భగవంతుడికి మనం ఇచ్చే కానుకల కంటే మనసులోని భక్తి ముఖ్యం. ఖాళీ చేతులతో వచ్చినా చాలు. నిండు మనసుతో ‘ఓం నమః శివాయ” అని ఒక్కసారి తలచుకుంటే చాలు, రాజన్న కరుణిస్తాడు” అని అర్చకులు సూచించారు.
వేయి సంవత్సరాలుగా కోట్లాది భక్తులకు అండగా నిలిచిన వేములవాడ రాజన్న క్షేత్రం నేటికీ అలాగే భక్తి పరిమళాలు వెదజల్లుతోంది. ఒకసారి దర్శించుకుంటే జీవితం ధన్యమవుతుందనేది భక్తుల దృఢ విశ్వాసం.
PHANI KUMAR. M ✍️✍️

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments