EPAPER
Monday, November 9, 2026
- Advertisment -spot_img

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

📰 Generate e-Paper Clip

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం..

  • ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యం.
  • అమరవీరుల స్ఫూర్తితో అంకితభావంతో విధులు నిర్వర్తించాలి.
  • రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.
  • శాంతిభద్రతల పరిరక్షణతోనే సమాజ అభివృద్ధి.
  • మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 21:

దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని అమరవీరుల స్థూపం వద్ద పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథులుగా హాజరై అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 154 మంది పోలీసు అమరవీరుల పేర్లను అడిషనల్ డీసీపీ కె.శ్రీనివాస్ చదివి వినిపించారు. అనంతరం ఆర్‌ఐ శేఖర్ ఆధ్వర్యంలో సాయుధ పోలీసులు శోకశస్త్రం నిర్వహించగా, అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా బలగాల దాడిలో భారత జవాన్లు వీరమరణం పొందారని, వారి త్యాగాలకు గుర్తుగా ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమరవీరులను స్మరించుకోవడమే కాకుండా వారు చూపిన ధైర్యం, దేశభక్తి, త్యాగనిరతిని ఆదర్శంగా తీసుకుని ప్రతి పోలీసు అధికారి విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణతో పాటు శాంతిభద్రతలు, అంతర్గత భద్రతను కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ప్రజలకు అండగా నిలవాలని, క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో పనిచేస్తూ పోలీసు శాఖపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం నెలకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. పోలీసులు ఏడాది పొడవునా ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వారి సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. ప్రతి పౌరుడు చట్టాలను గౌరవిస్తూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ప్రజల భద్రత, సమాజ శ్రేయస్సు కోసమే రూపొందించారని, పౌర బాధ్యతతో వాటిని పాటించినప్పుడే మెరుగైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్, అడిషనల్ డీసీపీ కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీ రవీందర్, ఏవో శ్రీనివాస్, పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!