సింగరేణిలో రాజకీయ జోక్యం.. కార్మికుల హక్కులకు సంకెళ్లు!
– ఒప్పందాలు చేసుకుని అమలు చేయకపోవడం యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనం
– ఆర్‌ఎల్‌సీ వద్ద కుదిరిన 23 డిమాండ్ల ఒప్పందంపై సర్క్యులర్లు జారీ చేయాలి
– మెడికల్ బోర్డు, మారుపేర్లు, డిపెండెంట్ ఉద్యోగాల సమస్యలు పరిష్కరించాలి
– కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
– లేకుంటే మరిన్ని ఆందోళనలు తప్పవు
– ఆర్జీ-1 జీఎం కార్యాలయ ముట్టడిలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ హెచ్చరిక
జనం వాయిస్, గోదావరిఖని, నవంబర్ 04:
సింగరేణిలో కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యంతో కుదిరిన ఒప్పందాలు రాజకీయ జోక్యం కారణంగానే అమలుకు నోచుకోవడం లేదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ ఆరోపించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. బుధవారం ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో సింగరేణి ఆర్జీ-1 జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
23 డిమాండ్ల ఒప్పందం ఏమైంది?
కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ అనేకసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో 2026 జూన్ 8న సమ్మె నోటీసు ఇచ్చామని తెలిపారు. అనంతరం రీజనల్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చల్లో ఆగస్టు 27న యాజమాన్యంతో 23 డిమాండ్లపై ఒప్పందం కుదిరిందన్నారు. ఒప్పందం ప్రకారం అమలు చేయాల్సిన అంశాలపై సర్క్యులర్లు జారీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మెడికల్ బోర్డు నిర్వహణలోనూ నిర్లక్ష్యం
ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చి మూడు నెలలు నిర్వహించిన అనంతరం నిలిపివేయడం అన్యాయమన్నారు. 2022 ఏప్రిల్‌లో మారుపేర్ల సమస్యపై కుదిరిన ఒప్పందం, ప్రభుత్వ కమిటీ నివేదిక వచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు. ముఖ్యంగా 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.
డిపెండెంట్ ఉద్యోగాలపై హామీ ఏమైంది?
వీటీసీ పూర్తి చేసిన మిగిలిన అర్హులైన డిపెండెంట్ అభ్యర్థులందరికీ నెల రోజుల్లోపు నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదని ఎల్లా గౌడ్ ఆరోపించారు. అర్హులైన సింగరేణి కార్మికులందరికీ సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తామని చెప్పి నేటికీ కార్యరూపం దాల్చలేదన్నారు.
గనుల్లో భద్రతా పరికరాల కొరత
గనుల్లో కార్మికుల భద్రతకు అవసరమైన బూట్లు, హెల్మెట్లు, బిట్లు, డ్రిల్ రాడ్లు, యంత్రాలు, హెచ్‌ఈఎంఎం యంత్రాల స్పేర్ పార్టులు, టైర్లు తక్షణమే సరఫరా చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. కార్మికుల భద్రత విషయంలో నిర్లక్ష్యం తగదని, అవసరమైన పరికరాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రూ.59 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి
విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన సుమారు రూ.59 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించేలా చర్యలు తీసుకోవడం లేదని ఎల్లా గౌడ్ ఆరోపించారు. ఆ బకాయిలను వెంటనే వసూలు చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. యూనియన్ల మధ్య పోటీతత్వం కార్మికులకు ప్రయోజనం కలిగించేలా ఉండాలే తప్ప, రాజకీయ జోక్యంతో కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలిగించకూడదన్నారు.
ఎన్నికలకు ఏఐటీయూసీ సిద్ధం
గత పదేళ్లపాటు టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసి, ఇప్పుడు ఎన్నికల నిర్వహణపై కోర్టును ఆశ్రయించడం హాస్యాస్పదమని విమర్శించారు. ఏఐటీయూసీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని, ఎన్నికలంటే భయపడే సంఘం కాదని స్పష్టం చేశారు. ఇతర సంఘాలు కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాడాలని, గుర్తింపు సంఘంపై విమర్శలకే పరిమితం కాకూడదని సూచించారు.
సమస్యలు పరిష్కరించకుంటే మరిన్ని ఉద్యమాలు
సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యం తగ్గించాలని, ఆర్‌ఎల్‌సీ సమక్షంలో కుదిరిన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని మడ్డి ఎల్లా గౌడ్ డిమాండ్ చేశారు. ముట్టడి అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. సింగరేణి సీఎండీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని కార్మికుల పెండింగ్ సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను, సహాయ కార్యదర్శి మాదన మహేష్, ఉపాధ్యక్షులు సంకె అశోక్, బోగ సతీష్ బాబు, నాయకులు ఎస్. వెంకట్ రెడ్డి, సిద్ధమల్ల రాజు, దొంత సాయన్న, ఎం. చక్రపాణి, చెప్యాల భాస్కర్, మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, గుర్రం ప్రభుదాస్, నాయిని శంకర్, బలుసు రవి, బండి మల్లేష్, ఇజ్జగిరి రాజు, బొల్లి శ్రీనివాస్, ఏ.వి.ఎస్. ప్రకాశ్, తాళ్లపెల్లి శ్రీనివాస్, మారుపేర్ల బాధితుల సంఘం నాయకులు లంక శ్రావణ్ గౌడ్, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments