లోక కల్యాణం కోసం ప్రత్యేక పూజలు: మంత్రి పోన్నం ప్రభాకర్.
- సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని అమ్మవారికి ప్రార్థనలు.
- ప్రతి పౌర్ణమికి మహా చండీయాగం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
- రేణుకా ఎల్లమ్మ ఆలయంలో 18వ మహా చండీయాగం.
జనం వాయిస్, హుస్నాబాద్, అక్టోబర్ 26:
హుస్నాబాద్‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో లోక కల్యాణం కోసం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 18వ మహా చండీయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి రోజున హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మహా చండీయాగం, ప్రతి అమావాస్య రోజున కొత్తకొండలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న మహా చండీయాగంలో హుస్నాబాద్ ప్రాంత ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments