EPAPER
Friday, November 13, 2026
- Advertisment -spot_img

హైదరాబాద్‌లో ఐవీఎఫ్‌ అక్రమ దందా.. తండ్రి చికిత్స కోసమని వచ్చి బాధితురాలిగా మారిన యువతి!

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌లో ఐవీఎఫ్‌ అక్రమ దందా.. తండ్రి చికిత్స కోసమని వచ్చి బాధితురాలిగా మారిన యువతి!

  • హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న అక్రమ అండాల విక్రయ దందా బట్టబయలు.
  • దేశవ్యాప్తంగా పేద మహిళలను లక్ష్యంగా చేసుకున్న ముఠా.
  • రూ.30,000 నుంచి రూ.50,000 ఆశ చూపి అండాల సేకరణ.
  • 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, 43 మంది మహిళలకు విముక్తి.
  • ఇంటికి వెళ్లలేక సంరక్షణ కేంద్రంలో బాధితుల ఆవేదన.

జనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 12:

తండ్రి ప్రాణాలు కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్న ఆ యువతికి డబ్బు అత్యవసరమైంది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. అక్రమార్కుల చేతిలో చిక్కి, ఆరోగ్యాన్ని పణంగా పెట్టాల్సిన దుస్థితికి చేరింది. హైదరాబాద్ మహానగరం కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ అండాల (ఊసైట్స్) విక్రయ దందాలో ఇది ఒక కన్నీటి గాథ మాత్రమే. పేదరికాన్ని పెట్టుబడిగా, నిస్సహాయతను ఆసరాగా చేసుకుని వందలాది మంది యువతుల జీవితాలతో చెలగాటమాడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు రట్టు చేశారు. ఈ దందా వెనుక విస్తుపోయే నిజాలు, హృదయవిదారక గాథలు వెలుగులోకి వచ్చాయి.

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బేగంపేట, ఎర్రగడ్డ, సరూర్‌నగర్ వంటి ప్రాంతాల్లోని హాస్టళ్లు, విల్లాలపై మెరుపుదాడులు చేసి, వివిధ రాష్ట్రాలకు చెందిన 43 మంది బాధితులకు విముక్తి కల్పించారు. ఈ రాకెట్ వెనుక కీలక సూత్రధారులుగా భావిస్తున్న 8 మందిని అరెస్టు చేశారు. రెండేళ్లుగా ఈ దందా యథేచ్ఛగా సాగుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

పేదరికమే పెట్టుబడి..
ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోని నిరుపేద కుటుంబాలే ఈ ముఠా లక్ష్యం. ఏజెంట్ల ద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోయిన, కుటుంబ పోషణ భారమైన యువతులను గుర్తిస్తారు. రూ.30,000 నుంచి రూ.50,000 వరకు డబ్బు ఆశ చూపి, హైదరాబాద్‌కు రప్పిస్తారు. ఇక్కడ వారిని రహస్యంగా ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో ఉంచి, బలవంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. అండాల సంఖ్య పెరిగాక, వాటిని సేకరించి నగరంలోని పలు ఐవీఎఫ్ కేంద్రాలకు అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో నగరానికి చెందిన 23 ఐవీఎఫ్ కేంద్రాలపై పోలీసులు నిఘా పెట్టారు.

కన్నీళ్లు పెట్టించే బాధితుల గాథలు
పోలీసులు రక్షించిన బాధితుల కథలు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. కోల్‌కతాకు చెందిన 25 ఏళ్ల యువతి కథ అందరినీ కలచివేస్తోంది. “మా నాన్నకు కిడ్నీ మార్పిడి కోసం రూ.3.5 లక్షలు అప్పు చేశాం. అప్పు ఇచ్చిన వాళ్లు ఇంటి మీదకు వస్తుండటంతో తట్టుకోలేకపోయాం. ఆ సమయంలో ఒక ఏజెంట్ పరిచయమై, రూ.50,000 ఇస్తానని, హైదరాబాద్ వస్తే చాలని చెప్పాడు. అండాలు అమ్మడం చట్టవిరుద్ధమని నాకు తెలియదు. నాన్నను బతికించుకోవడానికే ఈ నరకానికి వచ్చాను” అంటూ ఆమె కన్నీటిపర్యంతమైంది.

మరో మహిళ.. భర్త ప్రమాదంలో మంచాన పడటంతో, అతడి చికిత్స ఖర్చుల కోసం ఈ దారి తొక్కింది. క్యాటరింగ్ ఉద్యోగం అని చెప్పి మరికొందరిని మోసగించి ఇక్కడికి తీసుకొచ్చారు. బాధితుల ఆధార్ కార్డులు, బ్యాంకు పాస్‌బుక్‌లను కూడా ఏజెంట్లు తమ ఆధీనంలో ఉంచుకుని వారిని కట్టుబానిసలుగా మార్చారు.

పండగపూట ఇంటికి దూరం..
ప్రస్తుతం బాధితులందరినీ ఉజ్వల రెస్క్యూ హోంలో ఉంచి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయితే, పండగ వేళ కూడా కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడం వారిని మరింత కుంగదీస్తోంది. “దసరా ఇక్కడే గడిచిపోయింది. కనీసం ఛఠ్‌ పూజకైనా మమ్మల్ని మా ఇళ్లకు పంపించండి” అని వారు అధికారులను వేడుకుంటున్నారు. ఈ కేసులో కీలక సాక్షులైన ఈ బాధితులకు రక్షణ కల్పిస్తూనే, వారిని సురక్షితంగా ఇళ్లకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసులో ప్రధాన సూత్రధారి అమిత్ శర్మతో పాటు మిగతా నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!