రామగుండం ఎం.వి.ఐ. కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తి పెత్తనం!
- డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావాలంటే ప్రైవేట్ వ్యక్తికి డబ్బులివ్వాలా?
- రామగుండం ఎం.వి.ఐ. కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తి పెత్తనంపై ఆరోపణలు.
- అధికారుల కార్యాలయంలో అనధికార వ్యక్తి హవా ఏమిటి?
- అక్రమ వసూళ్ల వెనుక ఎవరున్నారు.. వాటాలు ఎవరికి వెళ్తున్నాయి?
- ఆఫీస్ సిబ్బంది బ్యాంకు అకౌంట్స్, ఫోన్ పే, గూగుల్ పే లు తనిఖీ చేయాలి.
జనం వాయిస్, రామగుండం, నవంబర్ 12:
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులది. కానీ రామగుండం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎం.వి.ఐ.) కార్యాలయంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైవింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాలన్నా, ఇతర రవాణా శాఖ సేవలు పొందాలన్నా ఓ ప్రైవేట్ వ్యక్తిని ఆశ్రయించి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతోందనే ప్రశ్నలు వాహనదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
అధికారుల కంటే ప్రైవేట్ వ్యక్తి దే పెత్తనమా?
ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగి కాని ఓ ప్రైవేట్ వ్యక్తి నిత్యం కార్యాలయంలో హడావుడి చేస్తూ, తనదే పెత్తనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయంలోకి వచ్చే వాహనదారులతో వ్యవహరించడం, పనులు చేయిస్తానంటూ డబ్బులు అడుగుతున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. అసలు ఆ వ్యక్తికి ఎం.వి.ఐ. కార్యాలయంతో ఉన్న సంబంధం ఏమిటి? ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం ఎవరిచ్చారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
డ్రైవింగ్ టెస్ట్‌కు కూడా డబ్బుల వసూళ్లా?
డ్రైవింగ్ టెస్ట్ అనేది నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన ప్రక్రియ. అభ్యర్థి డ్రైవింగ్ సామర్థ్యాన్ని పరిశీలించి అర్హత ఆధారంగా లైసెన్స్ మంజూరు చేయాలి. అలాంటప్పుడు టెస్ట్‌లో పాస్ చేయిస్తామంటూ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన రుసుములు తప్ప అదనంగా ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదనే విషయాన్ని అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.
వసూళ్ల వెనుక అసలు కథేంటి?
సదరు ప్రైవేట్ వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న వసూళ్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ డబ్బులు ఎవరి వద్దకు చేరుతున్నాయి? వసూళ్లలో ఎవరెవరికి వాటాలు అందుతున్నాయి? అధికారుల ప్రమేయం ఉందా? లేక వారి పేర్లు ఉపయోగించుకుని వ్యక్తిగతంగా వసూళ్లకు పాల్పడుతున్నారా? అన్న అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి.
ఉన్నతాధికారులు స్పందించేది ఎప్పుడు?
రామగుండం ఎం.వి.ఐ. కార్యాలయంలో జరుగుతున్నట్లు వినిపిస్తున్న ఆరోపణలపై రవాణా శాఖ ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టాలి. కార్యాలయంలో అనధికార వ్యక్తుల ప్రవేశం, వారి పాత్ర, డ్రైవింగ్ టెస్ట్ ప్రక్రియలో జోక్యం, అదనపు వసూళ్ల ఆరోపణలపై సమగ్రంగా పరిశీలించాలి. అవసరమైతే సంబంధిత రికార్డులు, ఫిర్యాదులు, చెల్లింపుల వివరాలను తనిఖీ చేయాలి. ప్రజల నుంచి వచ్చే ప్రతి రూపాయికి లెక్క ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం కొనసాగితే బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.
కార్యాలయ సీసి కెమెరా లు ఓపెన్ చేసి చూడాలి.
కార్యాలయంలో జరుగుతున్న లావాదేవీలు, జరుగుతున్న దోపిడీపై ఆఫీస్ ఆవరణలో ఉన్న సీసి కెమెరా లు ఓపెన్ చేసి చూడాలని అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వివిధ పనుల నిమిత్తం ఆఫీస్ కు వచ్చే వాహనదారులు కోరుతున్నారు. రామగుండం ఎంవిఐ ఆఫీస్ లో పని చేసే ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల బ్యాంకు స్టేట్మెంట్స్, ఫోన్ పే, గూగుల్ పే లాంటి హిస్టరీ లు చెక్ చేయాలనీ, తమ కుటుంబ సభ్యుల అకౌంట్స్ కూడ పరిశీలించాలని పలువురు కోరుతున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments