EPAPER
Friday, October 30, 2026
Google search engine
- Advertisment -spot_img

పదేళ్లయినా రామగిరి మండలానికి అభివృద్ధి ఏది?

📰 Generate e-Paper Clip

పదేళ్లయినా రామగిరి మండలానికి అభివృద్ధి ఏది?

  • 40 వేల ఓట్లు.. 60 వేల జనాభా ఉన్న మండలంపై నిర్లక్ష్యమెందుకు?
  • సింగరేణి ప్రభావిత గ్రామాలకు సీఎస్ఆర్, డీఎంఎఫ్ నిధులు కేటాయించాలి.
  • ప్రభుత్వ భవనాలకు స్థలాలు కేటాయించాలి.. సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుపై పునరాలోచించాలి.
  • నిధులు కేటాయించకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం.
  • బీజేపీ ఎంపీటీసీల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ హెచ్చరిక.

జనం వాయిస్, రామగిరి, అక్టోబర్ 30:

రామగిరి మండలం ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని బీజేపీ ఎంపీటీసీల ఫోరం పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శించారు. సుమారు 40 వేల ఓట్లు, 60 వేల జనాభా, 16 గ్రామపంచాయతీలు కలిగిన రామగిరి మండలాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. సింగరేణి బొగ్గు గనుల ప్రభావిత ప్రాంతంగా ఉన్నప్పటికీ మండలంలోని గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం దారుణమన్నారు. సింగరేణి సీఎస్ఆర్, డీఎంఎఫ్ నిధులు ఇతర జిల్లాలకు మళ్లుతున్నాయని ఆరోపిస్తూ, గనుల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న రామగిరి గ్రామాలకు ఆ నిధుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో నేటికీ ప్రభుత్వ శాఖలకు అవసరమైన సొంత భవనాలు లేకపోవడం పాలకుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. నూతన మండల ప్రజాపరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, రెవెన్యూ భవనం, పోలీస్ స్టేషన్‌తో పాటు పోలీస్ క్వార్టర్స్ నిర్మించాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ కార్యాలయాలు, మహిళా సంఘ భవనం, ప్రజా సమావేశ మందిరం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు గ్రంథాలయంతో కూడిన స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం, జూనియర్ కళాశాల, సింగరేణి పరిశ్రమల్లో ఉద్యోగాలకు ఉపయోగపడే సాంకేతిక శిక్షణ కోసం ఐటీఐ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సింగరేణి యాజమాన్యం వెంటనే అనువైన స్థలాలను కేటాయించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆయా స్థలాల్లో సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వడం సమంజసం కాదన్నారు. సింగరేణి పరిసర గ్రామాల్లో నివసిస్తున్న కార్మిక కుటుంబాలు కాలుష్యం కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. గత పదేళ్లలో రామగిరి మండలానికి ఎన్ని నిధులు కేటాయించారు? ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టారు? సీఎస్ఆర్, డీఎంఎఫ్ నిధుల వినియోగంపై ప్రజలకు స్పష్టమైన వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. హామీలతో కాలం గడపకుండా నిధులు మంజూరు చేసి ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో రామగిరి మండల ప్రజలతో కలిసి బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని మొలుమూరి శ్రీనివాస్ హెచ్చరించారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!