సింగరేణి ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ.
– మార్చి నాటికి వైద్యులు, సిబ్బంది నియామకం.
– 75 రోజుల్లో గోదావరిఖనిలో క్యాత్ ల్యాబ్ ప్రారంభం.
– సింగరేణి కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
జనం వాయిస్, వెబ్ డెస్క్:
శాసనసభలో సింగరేణి సంస్థకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు చేశారు. సింగరేణి ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఖాళీలను మార్చి నాటికి పూర్తిగా భర్తీ చేస్తామని వెల్లడించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. గోదావరిఖని ప్రాంతంలో 75 రోజుల్లో క్యాత్ ల్యాబ్‌ను ప్రారంభిస్తామని భట్టి తెలిపారు. రామగుండంలో క్యాత్ ల్యాబ్ నిర్మాణాన్ని పీపీపీ విధానంలో చేపట్టినట్లు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ అవార్డు పూర్తయిందని, నిర్ణీత గడువులోనే సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. సింగరేణి ఆసుపత్రుల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని, 32 మంది డాక్టర్ల నియామకానికి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని భట్టి వివరించారు. అదేవిధంగా 176 మంది పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. విశ్రాంత ఉద్యోగులకు కూడా సింగరేణి ఆసుపత్రుల్లో ఔషధ సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. సీపీఆర్ఎంఎస్ పథకం కింద విశ్రాంత ఉద్యోగులు రూ.8 లక్షల వరకు వైద్య సాయం పొందే అవకాశం ఉందని భట్టి చెప్పారు. సింగరేణి పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాల కేటాయింపుపై బోర్డు స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేంద్ర విధానాల కారణంగా కొన్ని బొగ్గు గనులు వేలానికి వెళ్లాయని, అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణికి కొన్ని గనులు దక్కేలా చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments