దసరా సీజన్లో మద్యం అమ్మకాల జోరు!
21 రోజుల్లో రూ.2,454 కోట్ల మద్యం విక్రయాలు.
గతేడాదితో పోలిస్తే 37.02 శాతం పెరిగిన అమ్మకాలు.
ఒక్కరోజే రూ.303 కోట్ల మద్యం విక్రయాలు.
జనం వాయిస్, హైదరాబాద్, అక్టోబర్ 22:
తెలంగాణలో దసరా పండుగ సీజన్ మద్యం వ్యాపారులకు కాసుల వర్షం కురిపించింది. పండుగల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 1 నుంచి 21వ తేదీ వరకు కేవలం 21 రోజుల్లోనే రూ.2,454.51 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈసారి మద్యం అమ్మకాల విలువ ఏకంగా 37.02 శాతం పెరగడం విశేషం. దసరా పండుగ సందర్భంగా మద్యం కొనుగోళ్లు ఊపందుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. ముఖ్యంగా బీర్ల విక్రయాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఈ 21 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 30.37 లక్షల కేసుల బీర్లు అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే అదనంగా 8.82 లక్షల కేసుల బీర్లు విక్రయించగా, బీర్ల అమ్మకాల్లో 40.93 శాతం వృద్ధి నమోదైంది. ఇతర మద్యం విక్రయాల్లోనూ 29.80 శాతం పెరుగుదల కనిపించింది. అక్టోబర్ 19న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా రూ.303.40 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగడం పండుగ సీజన్లో మద్యం వ్యాపారం ఏ స్థాయిలో సాగిందో తెలియజేస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో మద్యం విక్రయాలు కొంత నెమ్మదిగా సాగినప్పటికీ రెండో వారం నుంచి అమ్మకాలు గణనీయంగా పుంజుకున్నాయి. పండుగ సమీపించే కొద్దీ కొనుగోళ్లు పెరిగి విక్రయాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. మొత్తంగా దసరా సీజన్ మద్యం వ్యాపారానికి భారీ ఊతమిచ్చినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే పండుగల సందర్భంగా ఇంత భారీ మొత్తంలో మద్యం విక్రయాలు జరగడం సామాజికంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments