వ్యవసాయానికి నీళ్లివ్వలేం.. ఆరుతడి పంటలే వేసుకోండి!
- రైతులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన.
- 50 శాతం బోర్లు ఎండిపోయాయి.. తాగునీటికే తొలి ప్రాధాన్యం.
- రానున్న 8 నుంచి 10 నెలలు అత్యంత ప్రమాదకరం.
జనం వాయిస్, హైదరాబాద్, అక్టోబర్ 23:
రాష్ట్రంలో నెలకొన్న నీటి కొరత నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా కూరగాయలు, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయానికి సాగునీరు అందించడం సాధ్యం కాదని, అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. ఎల్నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులు, ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 50 శాతం బోర్లు ఎండిపోయాయని, రానున్న వేసవిలో నీటి ఎద్దడి మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యాసంగి వరి నాట్లు నవంబర్ నుంచి ప్రారంభమవుతాయని, అయితే సాగుకు చుక్క నీరు కూడా అందించలేని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. శ్రీశైలం, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని, 20 శాతం నీళ్లు కూడా లేవని పేర్కొన్నారు. ప్రస్తుతం 200 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, అందులోనూ డెడ్ స్టోరేజీ ఉన్నందున తాగునీటి అవసరాలకు మినహా ఇతర అవసరాలకు వినియోగించే పరిస్థితి లేదన్నారు. రాబోయే 8 నుంచి 10 నెలల పాటు అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత నీటి సంక్షోభాన్ని క్యాన్సర్ వ్యాధి తొలి దశతో పోల్చిన సీఎం, పరిస్థితి మరింత విషమించకముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments