పాల ధరలు పెంపు.. సామాన్యులకు మరో భారం
జనం వాయిస్, న్యూఢిల్లీ:
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రముఖ డైరీ సంస్థలు మరో షాక్ ఇచ్చాయి. దేశీయ ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ పాలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అమూల్ బ్రాండ్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అన్ని రకాల పాల ప్యాకెట్లపై లీటరుకు రెండు రూపాయల చొప్పున ధరలు పెంచింది. ఈ కొత్త ధరలు మే 14 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ధరల పెంపుతో అరలీటర్ అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ శక్తి పాల ప్యాకెట్ల ధర ఒక్కో రూపాయి మేర పెరిగింది. లీటర్ అమూల్ గోల్డ్ పాలు ధర 68 రూపాయల నుంచి 70 రూపాయలకు చేరగా, అమూల్ తాజా ధర 55 రూపాయల నుంచి 57 రూపాయలకు పెరిగింది.
అమూల్ బాటలోనే మరో ప్రముఖ డైరీ సంస్థ మదర్ డెయిరీ కూడా పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలు, ఇతర నగరాల్లో లీటర్ పాలపై రెండు రూపాయల వరకు పెంపు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. గేదె పాలు ధర లీటరుకు 75 రూపాయల నుంచి 80 రూపాయలకు పెరగగా, ఫుల్ క్రీమ్ పాలు ధర 69 రూపాయల నుంచి 72 రూపాయలకు చేరుకుంది. పాల ధరల పెంపుకు అనేక కారణాలు ఉన్నాయని డైరీ సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా పశువుల దాణా ధరలు భారీగా పెరగడం ప్రధాన కారణంగా పేర్కొంటున్నాయి. గడ్డి, తవుడు, ఇతర పశు ఆహార పదార్థాల ధరలు పెరగడంతో పాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగిందని సంస్థలు వెల్లడించాయి. అదేవిధంగా రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావంతో గ్రామాల నుంచి నగరాలకు పాలను తరలించే వ్యయం అధికమైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వేసవి కాలంలో సాధారణంగా పాల దిగుబడి తగ్గడం వల్ల సరఫరాపై ఒత్తిడి పెరిగిందని, దీంతో ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నాయి. ప్యాకేజింగ్ ఖర్చులు, విద్యుత్ ఛార్జీలు, శీతలీకరణ నిర్వహణ వ్యయాలు పెరగడం కూడా ధరల పెంపుకు కారణమయ్యాయి. ఈ అదనపు భారం చివరకు వినియోగదారులపైనే పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కూరగాయలు, వంటనూనెలు, గ్యాస్, ధాన్యాల ధరలు పెరిగిన పరిస్థితుల్లో ఇప్పుడు పాల ధరలు కూడా పెరగడంతో సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై మరింత భారం పడనుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు, హోటళ్లు, టీ దుకాణాలు, స్వీట్లు తయారీదారులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముంది. ధరల పెరుగుదల నేపథ్యంలో కొంతమంది వినియోగదారులు స్థానిక డైరీ కేంద్రాలు, ప్రభుత్వ పాల సరఫరా సంస్థల వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో విజయ డెయిరీ వంటి ప్రభుత్వ పాల కేంద్రాల వద్ద ధరలు కొంత వరకు నియంత్రణలో ఉండే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments