కోదండ రామాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక పూజలు
- జమ్మి పూజలో పాల్గొని ప్రజలకు దసరా శుభాకాంక్షలు.
- ప్రజల సుఖసంతోషాలు, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమన్న ఎమ్మెల్యే.
జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 20:
దసరా పండుగను పురస్కరించుకుని గోదావరిఖనిలోని కోదండ రామాలయంలో నిర్వహించిన జమ్మి పూజ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. కార్పొరేటర్, ఆలయ చైర్మన్ గట్ల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులను, స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, విజయాలు తీసుకురావాలని కోరారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు దసరా పండుగ ప్రతీకగా నిలుస్తుందని, ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం పెంపొందించేందుకు పండుగలు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రజలందరూ కులమతాలకు అతీతంగా పండుగలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సూచించారు. రామగుండం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ప్రాంత అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్, కార్పొరేటర్లు, ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments