పోలవరాన్ని రాష్ట్రానికి వరంగా మార్చడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు.
– క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ప్రాజెక్టు పనుల పురోగతి.
– 12 నెలల్లో ఆర్ అండ్ ఆర్ పూర్తి చేయాలని ఆదేశం.
– 2027 డిసెంబర్ నాటికి పోలవరం వినియోగంలోకి.
జనం వాయిస్, పోలవరం:
రాష్ట్రానికి జీవనాడిగా నిలిచే పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద మంత్రులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు పనులను గాడిన పెట్టి వేగవంతం చేయడంతో ఇప్పటి వరకు 87 శాతం మేర సివిల్ పనులు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. మిగిలిన సివిల్ పనులతో పాటు ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ (రెసెటిల్‌మెంట్ అండ్ రిహాబిలిటేషన్) పనులను 12 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిర్వాసితుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తూ వారికి న్యాయం చేయాలని సూచించారు. పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలని స్పష్టం చేశారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు అన్ని పనులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకువచ్చి రైతుల సాగునీటి కష్టాలను పూర్తిగా తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, పరస్పర సహకారంతో పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత వరంగా మార్చుతామని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments