ఇదివరకు గవర్నమెంట్ అర్హులైన పేదలకు ఇచ్చిన ప్రభుత్వ స్థలాల పంపిణీకి ప్రభుత్వ భూముల సర్వే వేగవంతం చేయాలి.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.
వెన్నంపల్లి గ్రామ ప్రభుత్వ భూముల సర్వే త్వరగా పూర్తి చేయాలని ఆదేశం.
నరేగా పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచన.
కాల్వ శ్రీరాంపూర్, ముత్తారం మండలాల్లో భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి.
తహసీల్దార్ కార్యాలయ సమీక్ష సమావేశంలో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్.
జనం వాయిస్, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్, జూన్-23:
ఇదివరకు గవర్నమెంట్ అర్హులైన పేదలకు ఇచ్చిన ప్రభుత్వ స్థలాల పంపిణీకి ప్రభుత్వ భూముల సర్వే వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం సందర్శించి ఎంపీడీవో, తహసీల్దార్ తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ వెన్నంపల్లి గ్రామంలోని ప్రభుత్వ భూముల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలకు ఇదివరకు ఇచ్చిన ప్రభుత్వ స్థలాలకు పట్టాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మండలంలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని తెలిపారు. పెద్దంపేట గ్రామంలో గోదాం నిర్మాణం కోసం గుర్తించిన 10 ఎకరాల భూమికి సంబంధించిన ప్రక్రియను త్వరగా పూర్తి చేసి భూమిని ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.
మండలంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎంపీడీవోకు సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద మంజూరైన సీసీ రోడ్ల పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని, అందుబాటులో ఉన్న నరేగా నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్లు, నరేగా పనులకు సంబంధించిన బిల్లులు త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేసి లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ముత్తారం మండలంలోని ఓడేడు శివారులోని వెంకటేశ్వర్లపల్లి గ్రామ పరిధిలో సీలింగ్ భూములను పరిశీలించారు. భూముల స్థితిగతులను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ డా.రాముడు ,ముత్తారం తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, కాల్వ శ్రీరాంపూర్ ఇంచార్జ్ ఎంపీడీవో దివ్యదర్శన్ రావు, తదితర అధికారులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments