EPAPER
Tuesday, July 14, 2026
Google search engine

ఎండలకు ఉపశమనం

📰 Generate e-Paper Clip

ఎండలకు ఉపశమనం

– మూడు రోజులు వర్షాల సూచన
– ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణ మార్పులు
– ఉరుములు, ఈదురుగాలులతో జల్లులు కురిసే అవకాశం
– ఎండ తీవ్రత కొనసాగినా మధ్యమధ్యలో వానలు

జనం వాయిస్, అమరావతి/హైదరాబాద్, ఏప్రిల్ 30:

తీవ్ర ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కొంత ఉపశమనం కలిగించే వార్త తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా సముద్ర ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా గురువారం నుంచి శనివారం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు.
ఈ వర్షాలతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడినా, వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం కొనసాగవచ్చని పేర్కొన్నారు.
తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని, ఎండ తీవ్రత మధ్యమధ్యలో కొనసాగుతూనే వానలు పడతాయని తెలిపారు. మొత్తానికి ఎండల తీవ్రత నుంచి తాత్కాలిక ఉపశమనం లభించే అవకాశమున్నప్పటికీ, ప్రజలు వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!