EPAPER
Saturday, September 12, 2026
Google search engine

పదేళ్లలో చేయలేనిది రెండేళ్లలో చేశాం: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్.

📰 Generate e-Paper Clip

పదేళ్లలో చేయలేనిది రెండేళ్లలో చేశాం: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్.

– మూసారాంబాగ్ వద్ద కొత్త బ్రిడ్జిని ప్రారంభించిన ముఖ్యమంత్రి
– పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేనిది రెండేళ్లలో చేసి చూపించామన్న సీఎం
– కేసీఆర్ ఒక్కరే రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని తీవ్ర ఆరోపణ
– ప్రతి నెలా 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని వెల్లడి

జనం వాయిస్, ఆగష్టు 31, హైద్రాబాద్:

గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట – మూసారాంబాగ్ వద్ద మూసీ నదిపై నూతనంగా నిర్మించిన వంతెనను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పదేళ్ల పాలనలో సాధ్యం కాని పనులను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే పూర్తి చేసి చూపిందని పేర్కొన్నారు.

వర్షం వస్తే మునిగిపోయే పాత వంతెన స్థానంలో నూతన వంతెనను నిర్మించాలని పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు ఆలోచించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అంబర్‌పేట నియోజకవర్గంలో సరైన ప్రభుత్వ కార్యాలయాలు లేవని, స్థానిక ప్రజల సౌకర్యార్థం ఇక్కడ ప్రభుత్వ భవనాలను నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా, 10 ఎకరాల స్థలంలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని ప్రకటించారు. బతుకమ్మ కుంట కబ్జాకు పాల్పడుతున్న వారి వెనుక ఎవరి హస్తముందో ప్రజలు గమనించాలని ఆయన కోరారు.

తాము బాధ్యతలు చేపట్టే సమయానికి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, కనీసం ఏడో తేదీ వచ్చినా ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని దయనీయ స్థితి నెలకొని ఉండేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలించిన 16 మంది ముఖ్యమంత్రులు కలిసి కేవలం రూ. 70 వేల కోట్లు అప్పు చేస్తే, కేసీఆర్ ఒక్కరే తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రూ. 8.11 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు.

తమ ప్రభుత్వం చెరువులను కబ్జా చేసి విల్లాలు, ఫామ్‌హౌస్‌లు నిర్మించడం లేదని, కేవలం ఆక్రమణలను తొలగించి జలవనరులను కాపాడుతోందని స్పష్టం చేశారు. గతంలో తనను విమర్శించిన ఉద్యోగులే ఇప్పుడు తమ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ప్రస్తుతం ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల పనితీరును బేరీజు వేసుకోవాలని ఆయన ఉద్యోగులను కోరారు. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!