పిఠాపురంలో రూ.1,500 కోట్ల అభివృద్ధి పండుగ: నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతామన్న పవన్.
- చేబ్రోలులోని శ్రీ సీతారామస్వామి వారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్.
- కొత్తగా నిర్మించిన రథశాల, యాగశాల, కాలక్షేప మండపం, అన్నదాన హాలు పనులను పరిశీలించిన పవన్.
- నాగులపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం.
జనం వాయిస్, కాకినాడ, సెప్టెంబర్ 22:
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండో రోజు విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతో పాటు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు రూ.1,500 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పర్యటనలో భాగంగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని శ్రీ సీతారామస్వామి వారిని దర్శించుకుని, ఏకాదశి వ్రతాచరణ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాభివృద్ధికి కేటాయించిన రూ.90 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన రథశాల, యాగశాల, కాలక్షేప మండపం, అన్నదాన హాలు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం యు.కొత్తపల్లి మండలంలో రూ.9.59 కోట్లతో పునరుద్ధరించిన నాగులపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించి, 52 ఆవాసాలలోని సుమారు 97 వేల మంది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులోకి తెచ్చారు. కొండేవారంలో ఇంటింటి కుళాయి కనెక్షన్లను స్వయంగా పరిశీలించారు. ఆర్ఆర్ బీహెచ్ఆర్ మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్, స్వయం సహాయక సంఘాలకు రూ.120 కోట్ల రుణాల చెక్కులు, లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ ఇళ్ల పట్టాలు, మత్స్యకారులకు లైఫ్ జాకెట్లు, పదో తరగతి ప్రతిభావంతులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. పిఠాపురం పట్టణంలో శాశ్వత డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం, రూ.225 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, రూ.34 కోట్లతో దేవాలయాల పునరుద్ధరణ, రూ.323 కోట్లతో ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ వంటి కీలక ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతులు పవన్ కల్యాణ్‌కు నాగలిని కానుకగా ఇచ్చి తమ కృతజ్ఞతలు తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments