భక్తులకు టీటీడీ శుభవార్త.. బ్రహ్మోత్సవాల్లో వీఐపీ సిఫార్సు లేఖలు బంద్.
- నేటి నుంచి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.
- సామాన్యుల కోసం ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు రద్దు.
- రేపు ఉదయం బంగారు తిరుచి, రాత్రి పెద్దశేష వాహన సేవ.
- సర్వదర్శనానికి 8 గంటల సమయం.
జనం వాయిస్, తిరుపతి, అక్టోబర్ 11:
తిరుమల శ్రీవారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని రకాల ఆర్జిత సేవలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈ రాత్రి 7 గంటలకు సేనాధిపతి విష్వక్సేనుల వారి ఊరేగింపుతో బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది.
అక్టోబర్ 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. రేపు (సోమవారం) ఉదయం 9 గంటలకు బంగారు తిరుచి ఊరేగింపు, రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలలో తొలి వాహనమైన పెద్దశేష వాహన సేవ జరగనుంది. ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ వరకు ఎలాంటి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ఉండవని టీటీడీ స్పష్టం చేసింది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులు మినహా, వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను స్వీకరించబోమని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. నిన్న (శనివారం) 79,737 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ. 3.71 కోట్ల ఆదాయం లభించింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున టీటీడీ తాగునీరు, అన్నప్రసాదం, భద్రత పరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments