EPAPER
Tuesday, November 10, 2026
- Advertisment -spot_img

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. వైద్యశాఖలో 2,929 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

📰 Generate e-Paper Clip

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. వైద్యశాఖలో 2,929 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

  • వైద్యారోగ్య శాఖలో 2,929 పోస్టుల భర్తీకి సన్నాహాలు.
  • 996 పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం
  • మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నియామకాల ప్రక్రియ.
  • ప్రస్తుతం కొనసాగుతున్న 2,711 పోస్టుల భర్తీ చివరి దశలో.
  • ఇప్పటికే 13,401 పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం.

జనం వాయిస్, తెలంగాణ, నవంబర్ 10:

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో మరో భారీ నియామక ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2,929 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వీటిలో 996 పోస్టులకు ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతి ఇవ్వగా, మరో 1,933 పోస్టులకు ఆమోదం లభించాల్సి ఉంది. త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది.

ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 996 పోస్టుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (198), ఆయుష్ ఫార్మసిస్ట్ గ్రేడ్-2 (308), టెక్నీషియన్ (290) వంటి కీలకమైన పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు బయోమెడికల్ ఇంజనీర్లు, ఫిజియోథెరపిస్టులు, రేడియోగ్రాఫర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎం పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలను తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ), ఆయుష్, ఎంఎన్‌జే వంటి పలు విభాగాల్లో చేపట్టనున్నారు.

ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూస్తున్న 1,933 పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (716), సివిల్ అసిస్టెంట్ సర్జన్ (మొత్తం 422), స్టాఫ్ నర్సు (194), ల్యాబ్ టెక్నీషియన్ (96) వంటి ముఖ్యమైన ఖాళీలు ఉన్నాయి. వీటికి కూడా ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రాగానే నోటిఫికేషన్లు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నియామక ప్రక్రియను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంఆర్‌బీ) ద్వారా వేగవంతం చేయనుండగా, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను మాత్రం టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది.

కాగా, ప్రస్తుతం ఎంఆర్‌బీ ఆధ్వర్యంలో 2,711 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో 1,931 ఎంపీహెచ్‌ఏ (మహిళ) పోస్టుల నియామకాలు దాదాపు పూర్తికాగా, త్వరలో తుది జాబితా రానుంది. మరోవైపు, 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు 4 వేలకు పైగా దరఖాస్తులు రావడంతో, వాటి పరిశీలనకు సమయం పడుతోందని అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యశాఖలో ఇప్పటివరకు 13,401 పోస్టులను భర్తీ చేయడం గమనార్హం.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!