కండక్టర్ ప్రవళిక మృతితో కదిలిన ఆర్టీసీ యాజమాన్యం!
- ఇక డోర్లు మూస్తేనే బస్సులు ముందుకు.
- డోర్లు లేని బస్సులకు కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశాలు.
- ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం.
జనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 05:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో మహిళా కండక్టర్ ప్రవళిక మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనతో ఆర్టీసీ యాజమాన్యం అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా బస్సుల భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో డోర్లు మూసిన తర్వాతే ముందుకు కదలాలని యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సిటీ బస్సులు, పల్లె వెలుగు సర్వీసులతో పాటు ప్రయాణికులను చేరవేసే అన్ని రకాల బస్సులకు ఈ నిబంధన వర్తించనుంది. డోర్లు పూర్తిగా మూసుకున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే డ్రైవర్లు బస్సును కదిలించాలని సూచించింది.
డోర్లు లేని బస్సులకు తక్షణమే ఏర్పాటు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న బస్సుల్లో డోర్లు లేని వాటిని గుర్తించి వెంటనే కొత్త డోర్లు ఏర్పాటు చేయాలని అన్ని డిపోల మేనేజర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇప్పటికే డోర్లు ఉన్న బస్సుల్లో అవి సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే అంశంపై కూడా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అద్దె బస్సులు, ఇతర సర్వీసుల్లోనూ భద్రతా ప్రమాణాలను పరిశీలించనున్నారు.
ప్రవళిక ఘటనతో మారిన నిబంధనలు
మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) గత నెల 25న విధుల్లో ఉండగా ప్రయాణికురాలితో చిల్లర విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కదులుతున్న బస్సు నుంచి ఆమె కిందపడటంతో వెనుక చక్రాలు కాళ్లపై నుంచి వెళ్లి తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినప్పటికీ.. దాదాపు పది రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూశారు. ఈ విషాద ఘటన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల్లో తీవ్ర ఆవేదనకు కారణమైంది. విధి నిర్వహణలో సిబ్బంది భద్రతతో పాటు ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది. ప్రవళిక మృతి నేపథ్యంలో ఆర్టీసీ తీసుకున్న తాజా నిర్ణయంతోనైనా బస్సు ప్రయాణాల్లో భద్రత మరింత మెరుగుపడుతుందా అన్నది వేచి చూడాలి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments