EPAPER
Friday, November 13, 2026
- Advertisment -spot_img

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది దుర్మరణం!

📰 Generate e-Paper Clip

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది దుర్మరణం!

మినీ బస్సును ఢీకొన్న కంటైనర్ లారీ.. నుజ్జునుజ్జయిన వాహనం.
మృతుల్లో అధికంగా పాఠశాల, కళాశాల విద్యార్థులే.. పలువురికి తీవ్ర గాయాలు.

జనం వాయిస్, అస్సాం, నవంబర్ 13:

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కజిరంగా సమీపంలోని జాతీయ రహదారిపై మినీ బస్సు, కంటైనర్ లారీ ఎదురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో 23 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది పాఠశాల, కళాశాల విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొకాఖాట్ నుంచి నాగావ్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు కజిరంగా కోహోరా పరిధిలోని హథీకూలి టీ ఎస్టేట్ సమీపంలో రంగాజన్ వద్ద జాతీయ రహదారి 715పైకి చేరుకుంది. అదే సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న కంటైనర్ లారీ మినీ బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రయాణికులు వాహనంలోనే చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది మృతదేహాలను వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. తొలుత ఏడుగురు మరణించినట్లు సమాచారం వెలువడగా, సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య 23కు చేరింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 27 నుంచి 35 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అంచనా. వీరిలో విద్యార్థినులు, పాఠశాల విద్యార్థులు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే కోహోరా మోడల్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం జోర్హాట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. జాతీయ రహదారిపై వేగ పరిమితుల ఉల్లంఘన, అతివేగం ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ఈ ఘోర ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అతుల్ బోరా ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. విద్యార్థుల మరణాలతో అసోంలో తీవ్ర విషాదం నెలకొంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!