EPAPER
Sunday, November 15, 2026
- Advertisment -spot_img

కొండగట్టులో భారీ కుంభకోణం.. రూ.23 కోట్ల నిధులు గోల్‌మాల్?

📰 Generate e-Paper Clip

కొండగట్టులో భారీ కుంభకోణం.. రూ.23 కోట్ల నిధులు గోల్‌మాల్?

  • ఏళ్ల తరబడి ముందుకు సాగని దేవాదాయ శాఖ విచారణ.
  • ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు.
  • ఆడిట్ నివేదికలో వెలుగులోకి వచ్చిన భారీ అవకతవకలు.
  • ప్రసాదాలు, హుండీ, సేవల టికెట్లలో నిధుల మాయం.

జనం వాయిస్, కొండగట్టు, నవంబర్ 15:

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు రూ.23 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆడిట్ నివేదికలో తేలగా, ఈ వ్యవహారంపై ఏళ్ల తరబడి విచారణ ముందుకు సాగకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

2013-14 నుంచి 2017-18 మధ్య కాలంలో జరిగిన ఆడిట్‌లో ఈ భారీ వ్యత్యాసాలు బయటపడ్డాయి. తొలుత రూ.2.26 కోట్లుగా ఉన్న అభ్యంతరాలు, తదుపరి ఆడిట్‌లలో రూ.23 కోట్లకు చేరినట్లు తెలిసింది. హుండీ ద్వారా వచ్చిన డబ్బులు, ఆర్జిత సేవల టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం పూర్తిగా ఖజానాకు జమ కాలేదని, ప్రసాదాల తయారీకి కొనుగోలు చేసిన సరుకుల లెక్కల్లోనూ భారీ తేడాలు ఉన్నాయని ఆడిట్ విభాగం స్పష్టం చేసింది. ఈ నిధుల దుర్వినియోగానికి ఆలయ ఉద్యోగులే బాధ్యులని తేల్చి చెప్పింది.

ఈ అక్రమాలపై విచారణ జరపాలని 2022లోనే అప్పటి ఆలయ ఈవో ఉన్నతాధికారులకు లేఖ రాశారు. దీంతో వేములవాడ ఆలయ ఈవోను విచారణాధికారిగా నియమిస్తూ అదే ఏడాది ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. 2025లో మరోసారి ఆదేశాలు ఇచ్చినా, విచారణ మాత్రం అంగుళం కూడా ముందుకు కదలలేదు. ఇటీవల విధుల్లో చేరిన ఓ కొత్త ఉద్యోగి ఈ ఫైల్‌ను గుర్తించి మళ్లీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

విచారణ నత్తనడకన సాగుతుండగానే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల్లో కొందరు పదోన్నతులు పొంది ఇతర ఆలయాలకు బదిలీ కావడం గమనార్హం. మరికొందరు ఎలాంటి చర్యలు లేకుండానే ఉద్యోగ విరమణ పొందారు. దేవాదాయ శాఖలోని కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే విచారణను ఆలస్యం చేస్తూ అవినీతిపరులను కాపాడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, గత ఆగస్టులో ఇదే ఆలయంలో రూ.49.29 లక్షల నిధుల దుర్వినియోగానికి సంబంధించి నలుగురు ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఒకరిని ఉద్యోగం నుంచి తొలగించి, ముగ్గురి ఇంక్రిమెంట్లను నిలిపివేశారు. ప్రస్తుతం ఆలయంలో 60 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక చందనోత్సవం నవంబర్ 16 నుంచి జరగనున్న తరుణంలో ఈ భారీ కుంభకోణం మళ్లీ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!