గద్వాలలో సంచలన తీర్పు.-భర్త హత్య కేసులో భార్య, నలుగురికి యావజ్జీవం.
జనం వాయిస్,గద్వాల, డిసెంబర్09:
జోగులాంబ గద్వాల జిల్లా కోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు స్థానికంగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంలా మారింది. భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన కేసులో భార్య కృష్ణవేణితో పాటు మరో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2019లో జరిగిన ఈ హత్య కేసు అప్పట్లో పెద్ద కలకలం రేపింది. అలంపూర్ పట్టణానికి చెందిన షాలు–కృష్ణవేణి దంపతులు సాధారణ కుటుంబం. షాలు డ్రైవర్‌గా, కృష్ణవేణి ఒక ప్రైవేట్ పాఠశాలలో అటెండర్‌గా పనిచేసేది. ఈ సమయంలో కృష్ణవేణి, లింగన్వాయి గ్రామానికి చెందిన వివాహితుడైన సంకటి మహೇಶ್తో అక్రమ సంబంధం కొనసాగించింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన షాలు ఆమెను పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో కృష్ణవేణి, తన అక్రమ సంబంధానికి అడ్డు అవుతున్న భర్తను తొలగించాలనే ఉద్దేశంతో మహేష్‌తో కలిసి హత్యకు కుట్ర పన్నారు. కర్నూలుకు చెందిన ఆటో డ్రైవర్ దడపోగు మహేష్, పెయింటర్ ఈడిగ మహేందర్, ఉల్చా రాజు, తంబలి కార్తీక్‌లను చేరదీసి సుపారి ఇచ్చారు. 2019 జూన్ 3న జ్వరంతో ఉన్న కూతురిని డాక్టర్ వద్దకు తీసుకెళుదామని చెప్పి షాలను కృష్ణవేణి బయటకు తీసుకెళ్లింది. తిరుగు ప్రయాణంలో హత్యా కుట్రలో ఉన్నవారికి నిరంతరం సమాచారం అందించేది. ఇమాంపూర్ స్టేజ్ వద్ద షాలను అడ్డుకుని, బీరు సీసాలతో దాడి చేసి, పొలాల్లోకి ఈడ్చి హతమార్చారు. సంఘటనా స్థలాన్నే దుండగుల దాడిలా చిత్రీకరించి కుటుంబసభ్యులను తప్పుదోవ పట్టించింది కృష్ణవేణి. పోలీసులు కాల్ డేటా రికార్డులను పరిశీలించగా కృష్ణవేణి, సంకటి మహేష్‌ల మధ్య అనేక కాల్స్ ఉన్నట్లు బయటపడింది. విచారణలో కృష్ణవేణి నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. కేసులో కీలకంగా నిలిచింది 12 ఏళ్ల కూతురి సాక్ష్యం—ఆమె కోర్టులో ధైర్యంగా చెప్పిన వివరాలు మొత్తం చిత్రాన్ని స్పష్టపరిచాయి. ఎనిమిది నెలలపాటు విచారణ జరిపిన తర్వాత, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత ఈరోజు తీర్పు వెలువరించారు. కృష్ణవేణి, సంకటి మహేష్, దడపోగు మహేష్, ఈడిగ మహేందర్, ఉల్చా రాజులకు యావజ్జీవ శిక్ష విధించారు. ఐదవ నిందితుడు తంబలి కార్తీక్‌పై నేరం రుజువు కాకపోవడంతో నిర్దోషిగా విడుదల చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోదాచారి మాట్లాడుతూ—కూతురు ధైర్యవంతమైన సాక్ష్యం, సాంకేతిక ఆధారాలు ఈ కేసు తీర్పులో కీలకమని తెలిపారు. ఈ తీర్పు కుటుంబ హింస, అక్రమ సంబంధాల పేరుతో జరుగు నేరాలకు గట్టి హెచ్చరికగా నిలుస్తుందని న్యాయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments