స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం.
వారం రోజుల్లో ప్రారంభం.
ప్లాస్టిక్ స్మార్ట్ కార్డుల జారీ.
ఈ-కేవైసీ తప్పనిసరి.
మూడు నెలల బియ్యం ఒకేసారి.
జనం వాయిస్, హైదరాబాద్, జూలై 20:
రాష్ట్రంలోని అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు కార్డుల స్థానంలో పీవీసీ ప్లాస్టిక్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టగా, హైదరాబాద్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్లాస్టిక్ స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఏ4 పరిమాణంలోని కాగితపు కార్డులు త్వరగా చిరిగిపోవడం, పాడవడం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త కార్డులపై లబ్ధిదారుడి వివరాలతో పాటు ప్రత్యేక స్పందన సంకేతం (క్యూఆర్ కోడ్), ఆహార భద్రతా కార్డు సంఖ్య, ఇతర భద్రతా గుర్తులను ముద్రించారు.
రాష్ట్ర రాజధానిలో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సమయంలోనే 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పౌరసరఫరాల శాఖ సమగ్ర కార్యాచరణ రూపొందించింది. స్మార్ట్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సేవల సామర్థ్యం మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. కార్డులలో భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు నకిలీ కార్డులకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొంటున్నారు. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ కార్డులు లబ్ధిదారులకు దీర్ఘకాలం ఉపయోగపడనున్నాయి.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 1 నుంచి నెల రోజుల పాటు రేషన్ దుకాణాలు తెరిచి ఉండగా, లబ్ధిదారులు తమ కోటా మేరకు బియ్యాన్ని పొందవచ్చు. రేషన్ సరుకులు పొందేందుకు ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరిగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడానికి జూలై 31ను చివరి తేదీగా నిర్ణయించారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా సమీపంలోని రేషన్ దుకాణంలో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని సూచించారు. గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని వారికి రేషన్ సరుకుల పంపిణీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments