ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం.
– 32% పెరుగుదలపై సీఎం చంద్రబాబు సంతృప్తి.
– ఇప్పటి వరకు 18.32 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ.
– రైతులకు 24 గంటల్లోనే ₹4,085 కోట్లు చెల్లింపులు.
– ఈ ఏడాది 50.75 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం.
జనం వాయిస్, అమరావతి:
2025–26 సీజన్ ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సచివాలయంలో నేడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 2606 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని అధికారులు నివేదించారు. ఇది గత ఏడాది ఇదే సీజన్‌తో పోలిస్తే 32 శాతం అధికమని, రైతుల ఉత్పత్తికి రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉన్నట్లు వెల్లడించారు.రైతులకు అవసరమైన గోనె సంచులను పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 7.89 కోట్ల సంచులు కొనుగోలు కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నాయని సమావేశంలో వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే చెల్లింపులు పూర్తిచేయాలన్న ప్రభుత్వ నిర్ణయం అమల్లోకువస్తూ, ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో ₹4,085 కోట్లు జమ అయినట్లు తెలిపారు.
ఈ ఏడాది మొత్తం 50.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్యం సాధ్యమయ్యేలా కొనుగోలు కేంద్రాల నిర్వహణను మరింత బలోపేతం చేస్తున్నట్లు అధికారులు వివరించారు. రైతుల ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుందన్న నమ్మకాన్ని కొనసాగించడం తమ ప్రధాన కర్తవ్యమని వారు అన్నారు.సమీక్షాసమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయం, పౌరసరఫరాలు, ఆర్థిక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం, రైతు సంతృప్తి అత్యంత ముఖ్యం అని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments