మన్యం జిల్లాలో ఏనుగుల హల్చల్.
– గంగరేగువలసలో పంటలకు భారీ నష్టం.
– పెరుగుతున్న ఏనుగుల సంఖ్యతో గ్రామాల్లో భయం.
– నష్టపరిహారం, భద్రత చర్యలు కోరుతున్న రైతులు.
జనం వాయిస్, పార్వతీపురం మన్యం జిల్లా:
మన్యం జిల్లాలో ఏనుగుల గుంపులు రోజురోజుకూ పెరుగుతూ గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. అడవుల్లో గజరాజుల మధ్య ఆధిపత్య పోరాటం కొనసాగుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ గ్రామంలోకి వచ్చి దాడులు చేస్తాయోనన్న ఆందోళనతో గ్రామస్థులు కంటిమీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నారు. తాజాగా కొమరాడ మండలం పరిధిలోని గంగరేగువలస గ్రామంలో మంగళవారం రాత్రి ఏనుగుల గుంపు ప్రవేశించింది. గ్రామంలో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించింది. ఈ ఘటనలో సుమారు 70 బస్తాల ధాన్యం నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పంట పొలాల్లోకి దిగి పంటలను ధ్వంసం చేయడంతో పాటు గ్రామాల్లోకి చొచ్చుకురావడం వల్ల ప్రాణభయం నెలకొంటోంది. కొన్ని సందర్భాల్లో ఏనుగులు పరస్పరం పోట్లాడుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. కళ్ల ముందే కష్టపడి పండించిన ధాన్యం నాశనం కావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. గ్రామం నుంచి ఏనుగుల గుంపును వెంటనే తరలించేందుకు అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని, పంట నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గస్తీ పెంచి భద్రత చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments