మోదీ నాయకత్వంలోనే రైల్వే సమస్యలకు శాశ్వత పరిష్కారం
– పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై స్పష్టత.
– ఆర్యుబి, ఆర్ఓబిలకు కేంద్ర హామీ.
– రెండేళ్లలో పనులు పూర్తి చేయిస్తాం.
– ప్రజాసేవే లక్ష్యం, ప్రచారం కాదు.
– ఎంపీ ఈటెల రాజేందర్.
జనం వాయిస్, మల్కాజిగిరి:
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఈస్ట్ ఆనంద్ భాగ్ రాణి రుద్రమదేవి పార్క్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్ రైల్వే ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పదుల సంవత్సరాలు గడిచినా రైల్వే ప్రాజెక్టులు ముందుకు సాగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని తెలిపారు. గతంలో కేంద్రం–రాష్ట్రం కలిసి నిధులు సమకూర్చి రైల్వే ప్రాజెక్టులు చేపట్టేవని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోవడంతో అనేక పనులు పెండింగ్‌లోనే మిగిలిపోయాయని అన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వందశాతం నిధులు కేంద్రం నుంచే విడుదల చేసి రైల్వే ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తోందని స్పష్టం చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో అనేక రైల్వే లైన్లు, స్టేషన్లు ఉండటంతో గంటల తరబడి రైల్వే గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ అంశాన్ని తాను పార్లమెంట్లో లేవనెత్తగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించి, ఎంత ఖర్చైనా సరే అన్ని ఆర్యుబి, ఆర్ఓబిలను పూర్తి చేయాలని ఆదేశించారని చెప్పారు. రైళ్ల వేగం, ఫ్రీక్వెన్సీ పెరిగిన నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా చిన్నచిన్న ఆర్యుబిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు, రైల్వే లైన్ల వెంబడి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసి మల్కాజిగిరి ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ముప్పై, నలభై ఏళ్లుగా ఎవరు పట్టించుకోని సమస్యలను మోదీ అండతో పరిష్కరిస్తున్నామని చెప్పుకోవడం జబ్బలు చర్చుకోవడం కాదని, కేంద్రం చేసినా రాష్ట్రం చేసినా ప్రజలకు మేలు చేయడమే అసలైన లక్ష్యమని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజాసేవకు బదులుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తే ప్రజలు గమనిస్తారని హెచ్చరించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments