బ్యాక్‌డోర్ నియామకాల ఆరోపణలు నిరుద్యోగుల ఆగ్రహం.
– బ్యాక్‌లాగ్ పోస్టుల పేరుతో అక్రమ భర్తీ?.
– జిల్లా స్థాయిలో దొడ్డిదారిన నియామకాలు.
– లక్షల రూపాయల వసూళ్లపై ఆరోపణలు.
– కల్వకుంట్ల కవిత.
జనం వాయిస్, హైదరాబాద్, ఫిబ్రవరి 7:
రాష్ట్రంలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ పేరుతో దొడ్డిదారిన నియామకాలు జరుగుతున్నాయని కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నెల 9, 10 తేదీల్లో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, విద్య తదితర శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు. నియామకాల ప్రక్రియలో పారదర్శకత లేకుండా, నిబంధనలను పక్కన పెట్టి అక్రమంగా చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. ఒక్కో ఉద్యోగానికి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న నిరుద్యోగుల ఆవేదనను ఆమె ప్రస్తావించారు. అర్హత, పరీక్ష, ప్రతిభ వంటి ప్రమాణాలను విస్మరించి నియామకాలు జరగడం వల్ల నిజమైన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో దొడ్డిదారిన నియామకాలు జరుగుతున్నాయన్న సమాచారం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.
ఈ విధమైన చర్యల వల్ల లక్షలాది మంది నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని ఆమె మండిపడ్డారు. ఉపాధి ఆశతో ఎదురు చూస్తున్న యువతకు ప్రభుత్వ వైఖరి నిరాశనే మిగులుస్తోందని, ఉద్యోగ భర్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమ నియామకాల వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన నిరుద్యోగులు, యువతనే ఇప్పుడు ప్రభుత్వం మోసం చేస్తోందని ఆమె ఆరోపించారు. ఉద్యోగాల పేరిట ఆశలు చూపి చివరికి యువత నోట్లో మట్టి కొట్టినట్లవుతోందని వ్యాఖ్యానించారు. తక్షణమే ఈ నియామకాలను నిలిపివేసి, న్యాయబద్ధమైన, పారదర్శకమైన విధానంతో మాత్రమే ఉద్యోగ భర్తీ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments