గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.
– భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: ప్రధాన కార్యదర్శి.
– ఎనిమిది జిల్లాల్లో విస్తృత ఏర్పాట్లకు ఆదేశాలు.
– కేబినెట్ ఉపసమితికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.
– ఇంజినీరింగ్ బృందాలతో పనుల ఖరారు.
జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 09:
రాబోయే గోదావరి పుష్కరాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు.
గోదావరి నది కందకూర్తి నుంచి భద్రాచలం వరకు బాసర మార్గంగా ఎనిమిది జిల్లాల్లో ప్రవహిస్తుందని పేర్కొంటూ ఈ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. అందుకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పుష్కరాల ఏర్పాట్లపై మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆ సూచనల మేరకు సంబంధిత శాఖలు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి కేబినెట్ ఉపసమితికి సమర్పించాలని ఆదేశించారు.
పుష్కరాల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే నియమించిన ఇంజినీరింగ్ చీఫ్‌లు, చీఫ్ ఇంజినీర్ల కమిటీ ప్రతిపాదిత పనులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. మౌలిక వసతుల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
పుష్కరాల సందర్భంగా తాగునీరు, శానిటేషన్, రవాణా, భద్రత వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమన్వయంతో పని చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో శైలజా రామయ్యర్, హనుమంతరావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments