EPAPER
Thursday, May 7, 2026
Google search engine

ఫీజుల దోపిడీపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి

📰 Generate e-Paper Clip

ఫీజుల దోపిడీపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి

– నాణ్యమైన విద్య – ఫీజుల నియంత్రణ రౌండ్ టేబుల్ సమావేశంలో కల్వకుంట్ల కవిత
– ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టం
– మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని డిమాండ్

జనం వాయిస్, హైదరాబాద్, మే 06:

హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన “నాణ్యమైన విద్య – ఫీజుల నియంత్రణ” రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థ, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల పెంపు, ప్రభుత్వ బాధ్యతలపై ఆమె తీవ్ర స్థాయిలో స్పందించారు.
ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నప్పటికీ ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల పెంపుపై ప్రభుత్వం స్పందించడం లేదని కవిత విమర్శించారు. కొన్ని పాఠశాలలు యాభై శాతం నుంచి నూట ఇరవై శాతం వరకు ఫీజులు పెంచినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రభుత్వాల బాధ్యతేనని ఆమె స్పష్టం చేశారు. సమానత్వం, స్వేచ్ఛ, మానవ విలువలు విద్య ద్వారానే సాధ్యమని ప్రపంచం గుర్తించిందన్నారు. పిల్లల చదువు బాధ్యత కేవలం తల్లిదండ్రులదే కాదని, ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు వ్యాపార ధోరణితో నడుస్తున్నాయని కవిత ఆరోపించారు. రాజకీయ నాయకులకు చెందిన విద్యాసంస్థలే ఎక్కువగా ఉన్నాయని, విద్యను వ్యాపారంగా మార్చడం ఆందోళనకరమని అన్నారు. ఫీజుల దోపిడీకి తక్షణ పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో అరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల్లో ఎక్కువ శాతం ప్రైవేట్ పాఠశాలల్లోనే చదువుతున్నారని ఆమె తెలిపారు. పిల్లలు బాగా చదువుకోవాలన్న తల్లిదండ్రుల బలహీనతను కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు వ్యాపారంగా మార్చుకున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జీవో జారీ చేసి గతేడాదితో పోలిస్తే ఒక్క రూపాయి కూడా ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఈ ఏడాది నూట ఇరవై శాతం ఫీజులు పెంచడాన్ని కవిత తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న పాఠశాలలోనే ఇంత భారీగా ఫీజులు పెరగడం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వేల కోట్ల రూపాయల మేర పేరుకుపోయాయని కవిత పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని బలహీనపరిచేలా తీసుకొచ్చిన జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్య, వైద్యం విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని ఆమె స్పష్టం చేశారు. తమిళనాడు తరహాలో ఫీజుల నియంత్రణకు శాశ్వత అథారిటీ ఏర్పాటు చేయాలని, లేదా గుజరాత్ మాదిరిగా ఫీజులకు పరిమితి విధించే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. విద్య, వైద్యం అంశాల్లో ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కవిత కోరారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!