బిస్కెట్ ప్రకటనతో మారిన రమ్యకృష్ణ జీవితం.
జనం వాయిస్, సినిమా, జూన్ 5:
సినీ పరిశ్రమలో ఎంతోమంది కథానాయికలు కొద్ది సినిమాలకే పరిమితమవుతుంటే, మరికొందరు మాత్రం దశాబ్దాల పాటు తమ ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటారు. అలాంటి అరుదైన నటీమణుల్లో రమ్యకృష్ణ ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
రమ్యకృష్ణ సినీ ప్రస్థానం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఆమెను చిత్రసీమకు పరిచయం చేయడంలో ఒక బిస్కెట్ ప్రకటన కీలక పాత్ర పోషించిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అప్పట్లో తమిళంలో తెరకెక్కుతున్న ‘వెల్లై మనసు’ చిత్రానికి ప్రధాన పాత్ర కోసం నిర్మాతలు కొత్త ముఖాన్ని వెతుకుతున్న సమయంలో, ఒక పత్రికలో ప్రచురితమైన బిస్కెట్ ప్రకటనలో రమ్యకృష్ణ ఫొటో కనిపించిందట. ఆమె రూపం నచ్చడంతో వివరాలు సేకరించగా, ప్రముఖ పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామికి మేనకోడలు అని తెలిసినట్లు సమాచారం.
దీంతో చిత్రబృందం చో రామస్వామిని సంప్రదించి రమ్యకృష్ణను సినిమాలో నటింపజేయాలని కోరిందట. అనంతరం దర్శకుడు స్వయంగా వెళ్లి ఆమెను కలవడంతో ‘వెల్లై మనసు’ చిత్రంలో కథానాయికగా అవకాశం లభించింది. ఆ సమయంలో రమ్యకృష్ణ ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని కావడం విశేషం.
తమిళంలో తొలి చిత్రం చేసిన తర్వాత ‘బాల్యమిత్రులు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అనంతరం వరుస విజయాలతో అగ్ర కథానాయికగా ఎదిగి, దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. అందం, అభినయం, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన రమ్యకృష్ణ అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
ఒక చిన్న ప్రకటనతో ప్రారంభమైన ప్రయాణం, నేడు భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత గౌరవనీయ నటీమణుల్లో ఒకరిగా రమ్యకృష్ణను నిలబెట్టిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments