ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ పట్టాలపై కఠిన చర్యలు.
ముత్తారం మండలంలోని మైదంబండ, పోతారం గ్రామాల్లో అక్రమ పట్టాలు గుర్తింపు.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.
జనం వాయిస్, పెద్దపల్లి, జూన్ 24:
ప్రభుత్వ భూముల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ పట్టాలు, భూ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు కొనసాగిస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముత్తారం మండలంలోని పోతారం, మైదంబండ గ్రామాల్లో ప్రభుత్వ భూములపై అక్రమంగా సృష్టించబడిన పట్టాలపై సమగ్ర విచారణ నిర్వహించినట్లు తెలిపారు. విచారణలో భాగంగా రెవెన్యూ రికార్డులు, క్షేత్రస్థాయి పరిశీలన, సంబంధిత అధికారుల నివేదికలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించగా పోతారం గ్రామంలోని సర్వే నెం.59లో 19 ఎకరాలు 01 గుంటల భూమి, మైదంబండ గ్రామంలోని సర్వే నెం.113లో 11 ఎకరాలు 02 గుంటల భూమి ప్రభుత్వ భూములుగా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు సదరు భూములను ఎప్పుడూ సాగు చేయలేదని, భూములు వారి భౌతిక స్వాధీనంలో కూడా లేవని విచారణలో తేలిన నేపథ్యంలో ప్రభుత్వ భూములపై అక్రమంగా సృష్టించబడిన పట్టాలను రద్దు చేసినట్లు తెలిపారు. తదనుగుణంగా సంబంధిత భూములను తిరిగి ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకుని నోషనల్ ఖాతాలో నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆక్రమణల తొలగింపు ప్రక్రియను పూర్తి చేసి భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వ్యక్తులపై, ప్రభుత్వ భూములపై అక్రమ హక్కులు పొందేందుకు సహకరించిన మిషన్ భగీరథ మంథని సబ్ డివిజన్ హెల్పర్ గుజ్జుల శ్రీధర్, మంథని ముత్తారం ఎంపిడిఓ కార్యాలయ డేటా ఎంట్రీ ఆపరేటర్ పాదాల సతీష్, ముత్తారం నరేగా ఫీల్డ్ అసిస్టెంట్ ధూమల శ్రవణ్ వారిపై, అలాగే ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై సంబంధిత చట్టాలు, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments